Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీపై చర్చించేందుకోసం మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం సోమవారం భేటీ అయింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో నిర్వహించిన ఈ సమావేశానికి ఉపసంఘంలోని సభ్యులైన మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాసగౌడ్, మల్లారెడ్డి హాజరయ్యారు. పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు సహా వివిధ ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకుని నివసిస్తోన్న పేదలకు వీలైనంత త్వరగా పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఉపసంఘం ఆదేశించినట్టు తెలిసింది. గ్రామ కంఠంలోని స్థలాలకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన కసరత్తు.. 58, 59 ఉత్తర్వులకు లోబడి క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారం, ప్రస్తుత స్థితి, సంబంధిత అంశాలపై మంత్రులు ఈ సందర్భంగా సమీక్షించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రస్తుత స్థితికి సంబంధించిన పూర్తి వివరాలు, సమాచారాన్ని వీలైనంత త్వరగా సిద్ధం చేయాలంటూ అధికారులను కమిటీ కోరినట్టు సమాచారం. సోమవారం మరోసారి సమావేశమై స్థలాల సంబంధిత అంశాలు, సమస్యల పరిష్కారంపై కమిటీ చర్చిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాసగౌడ్... బీఆర్కే భవన్ నుంచి నూతన సచివాలయం, అమరవీరుల స్మారక భవనం పనులను పరిశీలించారు.