Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
విద్యార్థుల ప్రాణాలను తీస్తున్న శ్రీచైతన్య యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆ విద్యార్థికి అండగా నిలబడిన ఎస్ఎఫ్ఐ నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న నిమ్మల రమాదేవి ఆత్మహత్యకు కారకులైన యాజమాన్యంపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మార్కులు, ర్యాంకుల కోసం విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని తెలిపారు. లాభాలు తప్ప విద్యార్థుల సంక్షేమం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనీ, అవి శ్రీచైతన్య చేస్తున్న హత్యలేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఆ యాజమాన్యంపై హత్యకేసు, క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆ విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను విడుదల చేయాలని తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలనీ, సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
విచారణ జరపాలి : పీడీఎస్యూ
శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న నిమ్మల రమాదేవి ఆత్మహత్య ఘటనపై విచారణ జరపాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం, ప్రధాన కార్యదర్శి ఇడంపాక విజరుకన్నా డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించని కార్పొరేట్ కాలేజీల గుర్తింపును రద్దు చేసి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తెలిపారు.
శ్రీచైతన్యను ప్రభుత్వం
స్వాధీనం చేసుకోవాలి : పీడీఎస్యూ
శ్రీచైతన్య విద్యాసంస్థలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పి మహేష్, ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన ఆ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఆ విద్యాసంస్థ ఎలాంటి నిబంధనలు పాటించకున్నా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఇంటర్ బోర్డు అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు.