Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'హరిణ వనస్థలి' నుంచి 1.354 హెక్టార్ల భూమి కేటాయింపు : ఆమోదం తెలిపిన రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు
- శ్రీశైలం రహదారి విస్తరణకు అనుమతి నిరాకరణ
- వన్యప్రాణుల దాడిలో చనిపోతే రూ.10 లక్షల పరిహారానికి ప్రతిపాదనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వనస్థలిపురంలో నిర్మించబోయే బస్‌టెర్మినల్‌కు మహవీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కు నుంచి 1.354 హెక్టార్ల భూమిని ఇచ్చేందుకు వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదం తెలిపిందని పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్ఎం.డోబ్రియాల్ తెలిపారు. శ్రీశైలం రహదారి విస్తరణకు అనుమతి ఇవ్వా లంటూ వచ్చిన దరఖాస్తును తిరస్కరించామన్నారు. వన్యప్రాణుల దాడిలో ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చే ప్రతిపాదనలను రాష్ట్ర సర్కారుకు పంపనున్నట్టు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వన్యప్రాణి మండలి, మనుషులు-జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచన కమిటీ సమావేశాలను నిర్వహించారు. స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిన తర్వాత జరిగిన తొలిసమావేశం ఇదే. సమావేశాల నిర్ణయాలను డోబ్రియాల్ మీడియాకు వివరించారు. రాష్ట్రంలో మొదటి సారి చేపట్టిన పులుల ఆవాసాల్లో ఉన్న మానవ ఆవాసాల తరలింపు (కవ్వాల్‌లో రెండు గ్రామాలు) ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నదని చెప్పారు. వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచాలని నిర్ణయించామని తెలిపారు. ప్రస్తుతమిస్తున్న రూ.5 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. సాధారణ గాయాలైతే వాస్తవ వైద్యం ఖర్చు (లక్ష రూపాయలకు మించకుండా), తీవ్రంగా గాయపడితే వైద్యానికి అయ్యే ఖర్చు (మూడు లక్షల రూపాయలకు మించకుండా), అంగవైకల్యం ఏర్పడితే లక్ష రూపాయల పరిహారం, పెంపుడు జంతువులు చనిపోతే వాస్తవ అంచనా(యాభై వేల రూపాయలకు మించకుండా) ఇచ్చే ప్రతిపాదనలను కూడా సిద్ధం చేశామన్నారు. అలాగే పంట నష్ట పరిహారాన్ని రూ.7,500కు పెంచాలని కూడా సిఫారసు చేయనున్నట్టు తెలిపారు. గత బోర్డు సమావేశంలో 24 ప్రతిపాదనలు అటవీ అనుమతుల కోసం రాగా 15 అప్లికేషన్లను పరిశీలించి అనుమతుల కోసం నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుకు పంపామన్నారు. మిగతా తొమ్మిది రాష్ట్ర పరిధిలో ఉన్నాయన్నారు. తాజాగా మరో ఏడు ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. వనస్థలిపురంలోని బస్‌టెర్మినల్‌కు స్థలం కేటాయించిన నేపథ్యంలో హరిణ వనస్థలి కోసం అవసరమైన రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీశైలం రహదారి విస్తరణ కోసం వచ్చిన ప్రతిపాదనను అమ్రాబాద్‌లోని వన్యప్రాణి సంరక్షణను దృష్టిలో పెట్టుకుని తిరస్కరించామ న్నారు. కడెం పరిధిలో లక్ష్మీపూర్ లిప్ట్, నాగార్జున సాగర్ పరిధిలో పెద్ద గుట్ట లిప్ట్ కేబుల్ పనులకు అనుమతు లిచ్చామన్నారు. వన్యప్రాణులు ప్రమాదంలో పడ్డప్పుడు కాపాడేందుకు అవసరమైన రెస్క్యూ టీమ్‌ల సంఖ్యను పెం చాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వ రరావు, ఇతర సభ్యులు కోవ లక్ష్మి, రాఘవ, బానోతు రవికుమార్, అనిల్ కుమార్, పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎం.సీ. పర్గెయిన్, అటవీశాఖ అడిషనల్ సెక్రటరి ప్రశాంతి, ఓఎస్డీ శంకరన్, ఇతర అధికారులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.