Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాల ధర్నా
నవతెలంగాణ-బోడుప్పల్
ఇంటర్లో పరీక్షల్లో మాస్ కాపియింగ్ చేశావంటూ కళాశాల యాజమాన్యం మందలించడంతో అవమానంగా భావించిన విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ మేడిపల్లి పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. మేడిపల్లి పోలీసులు, విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా, బల్మురు మండలం చెంచుగూడా గ్రామానికి చెందిన నిమ్మల రాములు పెద్ద కుమార్తె రమాదేవి(17) మేడ్చల్ జిల్లా పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ చైతన్య ఇంటర్ కళాశాలలో మొదటి ఏడాది చదువుతున్నది. సోమవారం ఫ్రీఫైనల్ పరీక్షల్లో చూసి రాస్తుందని లెక్చరర్ మందలించారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమాదేవి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు తలుపు తీసేందుకు ప్రయత్నించగా ఎంతకూ తీయకపోవడంతో కిటికిలోంచి చూశారు. రమాదేవి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దాంతో వారు యాజమాన్యానికి సమాచారం ఇవ్వగా.. వారు మేడిపల్లి పోలీసులకు చెప్పారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి గాంధీ ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
కళాశాల వేధింపులు భరించలేకనే రమాదేవి ఆత్మహత్య చేసుకుందని, కళాశాల గుర్తింపు రద్దు చేయడంతోపాటు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, బీఅర్ఎస్వీ, బీఎస్పీ, కాంగ్రెస్ నేతలు కళాశాల ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సంతోష్ రాథోడ్ మాట్లాడుతూ.. మార్కులు, ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్నారని, విద్యార్థిని ఆత్మహత్యకు కారకులైన కళాశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నేతలను పోలీసులు అరెస్టు చేసి ఉప్పల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకట్ రాములు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, మేడ్చల్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎండీ అన్వర్, కాంగ్రెస్ పార్టీ పీర్జాదీగూడ నగర అధ్యక్షుడు తుంగతుర్తి రవి, బీఆర్ఎస్వీ నేత వర్కాల శివకిషోర్ గౌడ్, రాకేష్, బీఎస్పీ నాయకులు అంబేద్కర్, ఎంఆర్పీఎస్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ పంగ ప్రణరు తదితరులు పాల్గొన్నారు.