Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించనున్న సంఘం అధ్యక్షులు ఎ.విజయరాఘవన్
- 17న భారీ బహిరంగ సభ
- ముఖ్య అతిథిగా కేరళ సీఎం పినరయి విజయన్
- 16న పలు అంశాలపై సెమినార్లు
- హాజరుకానున్న ప్రకాశ్ కరత్
- అరుణారుణమైన హౌరా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత పదో మహాసభ పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో బుధవారం ప్రారంభం కానుంది. ఈనెల 18 వరకూ ఆ మహాసభ కొనసాగనుంది. కామ్రేడ్ జ్యోతిబసునగర్లోని కుమార్ సిరార్కర్, సారంగధర్ పాశ్వాన్ వేదికగా అది కొనసాగనుంది. మహాసభ ప్రారంభ సూచికగా బుధవారం ఆ సంఘం అఖిల భారత అధ్యక్షులు ఎ.విజయ రాఘవన్ అరుణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. సంబంధిత ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మహాసభ నేపథ్యంలో గురువారం వివిధ అంశాలపై సెమినార్లు నిర్వహించనున్నారు. ముఖ్య వక్తగా ప్రకాశ్ కరత్ హాజరై 'కార్పొరేటీకరణ, హిందూత్వ ప్రమాదం..వ్యవసాయ కార్మికులపై ప్రభావం' అనే అంశంపై ప్రసంగించనున్నారు. ఈనెల 17న జరిగే భారీ బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. 20 రాష్ట్రాలకు చెందిన 732 మంది ప్రతినిధులు, పరిశీలకులు మహాసభకు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి 81 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 45 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. వీరితో పాటు అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్నన్‌మొల్లా, విజ్జుకృష్ణన్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్సేన్తోపాటు పలు సంఘాల నాయకులు హాజరై సౌహార్ద్ర సందేశాలివ్వనున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే పనికి పూనుకున్న తర్వాత వస్తున్న మార్పులు, గ్రామీణ భారతంలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మహాసభలో ప్రధానంగా చర్చించనున్నారు. వ్యవసాయ కూలీలకు ప్రధాన సమస్యలుగా ఉన్న ఉపాధి కల్పన, సామాజిక భద్రతపై కూడా చర్చిస్తారు. వ్యవసాయంలో నిరంతర సంక్షోభాలతో పనిదినాలు తగ్గిన క్రమంలో వ్యవసాయ కార్మికులు, పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటి పరిష్కారం కోసం కేంద్రంపై చేయాల్సిన పోరాటాలకు సంబంధించిన కార్యాచరణను మహాసభలో రూపొందించనున్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెరిగిన జీవన వ్యయం, సాంఘిక సంక్షేమం పట్ల పాలకుల చిన్నచూపుతో గ్రామీణ పేదల జీవితాలు మరింత అభద్రతలో కూరుకుపోయాయి. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ నివేదిక ప్రకారం ఒక్క 2021లోనే 5,563 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరంతా పనుల్లేక, కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలకు పాల్పడిన వారే. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికలో మన దేశం 107వ స్థానానికి పడిపోయిన విషయం విదితమే. ఇలాంటి సమయంలో ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నది. వ్యవసాయం, మార్కెటింగ్ వ్యవస్థలను కార్పొరేట్లకు అప్పగించే పనిలో ఉన్న మోడీ సర్కారు కులాలవారీగా హాజరు నమోదు చేయాలనే అహేతుక ఆలోచనతో ముందుకు సాగుతున్నది. దాంతోపాటు ప్రతిరోజూ ఆన్లైన్లో రెండుపూటలా హాజరు నమోదు చేయాలనే షరతును విధించింది. పాలకుల విధానాలతో పేదలు భూమి నుంచి వేగంగా దూరమవుతున్నారు. 1992-93లో గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని కుటుంబాలు 35 శాతముంటే ప్రస్తుతం అది 50 శాతానికి దాటింది. దీన్నిబట్టి భూమి కొందరి వద్దే ఏ రకంగా కేంద్రీకృతమవుతున్నదో.. ప్రజలు ఏ విధంగా పేదరికంలోకి కూరుకుపోతున్నారో అర్ధమవుతున్నది. మరోవైపు కేంద్రం వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల కష్టాలను వినడం లేదు కానీ ప్రజలను విభజించి మనుస్మృతిని తిరిగి స్థాపించాలనే ఆర్ఎస్ఎస్ అజెండాతో ముందుకు సాగుతున్నది. దళితులు, గిరిజనులపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని తిరోగమనం వైపు మళ్లించాలనే బీజేపీ ఎత్తుగడలను ఎక్కడికక్కడ తిప్పికొడుతూ... క్షేత్రస్థాయిలో వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, పేదలు, వృత్తిదారులందర్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి వర్గ ఐక్యతను సాధించేందుకు చేయాల్సిన కృషిపైనా వ్యకాస మహాసభలో ప్రధానంగా చర్చించనున్నారు. రోజురోజుకీ పనిదినాలు తగ్గిపోతున్న క్రమంలో వ్యవసాయ కూలీల భద్రత కోసం సమగ్ర చట్టం తీసుకురావాలనే డిమాండ్‌పైనా ఈ సభలో ప్రధానంగా చర్చిస్తారు. మహాసభ నేపథ్యంలో హౌరా నగరం ఆసాంతం ఎరుపు రంగును పులుముకుంది.
విస్తృత ఏర్పాట్లు
బి.వెంకట్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి
'అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పురుడుపోసుకున్న బెంగాల్ గడ్డపై పదో మహాసభ జరుగబోతున్నది. బెంగాల్లో ఇదే తొలి మహాసభ. దీన్ని జయప్రదం చేసేందుకోసం ఇప్పటికే విస్తృతంగా ఏర్పాట్లు చేశాం. పశ్చిమ బెంగాల్‌లోని అమరవీరులను స్మరించుకుంటూ ఆ రాష్ట్రంలో ప్రారంభమైన నాలుగు జాతాలు బుధవారం ఉదయానికి మహాసభ ప్రాంగణానికి చేరుకోనున్నాయి. గ్రామీణ భారతంలో వర్గ ఐక్యత కోసం చేయాల్సిన కృషి, పోరాటాలపై మహాసభలో ప్రధానంగా చర్చిస్తాం. కోవిడ్‌తో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజా పంపిణీ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. అందుకు సంబంధించి కేటాయింపులను రూ.2.87 లక్షల కోట్ల నుంచి రూ.1.90 లక్షల కోట్లకు కుదించటం దారుణం. బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి కేటాయించిన రూ.60 వేల కోట్లు ఏ మూలకూ సరిపోవు. దీనివల్ల వంద రోజుల పనేమోగానీ కనీసం 20 పని దినాలు దొరకటం కూడా కష్టం కానున్నది. ఈ క్రమంలో ఆ చట్టాన్ని రక్షించుకునేందుకు పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఏప్రిల్ ఏడో తేదీన వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మికులు ఢిల్లీలో తలపెట్టిన మజ్దూర్ కిసాన్ ఏక్తా ర్యాలీలో పాల్గొంటాం. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతాం...'