Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాయంత్రం అల్పాహారం అందజేత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి ఉదయం, సాయంత్రం పూట ప్రత్యేక తరగతులను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులుంటాయి. కరోనా తర్వాత వందశాతం సిలబస్‌తో పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది నుంచి పదో తరగతిలో ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లతోనే పరీక్షలను నిర్వహిస్తారు. ఉత్తీర్ణత శాతం పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యేంత వరకూ ప్రత్యేక తరగతులను నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్ మూడు నుంచి 13వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు 34 పనిదినాలపాటు ఆ విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం (స్నాక్స్) అందించనున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో అల్పాహారం కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 ఖర్చు చేస్తున్నట్టు వివరించింది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4,785 పాఠశాలల్లో 1,89,791 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. వారికి స్నాక్స్ కోసం రోజుకు రూ.28,46,865 ఖర్చవుతుందనీ, 34 రోజులకు వారికి రూ.9,67,93,410 ఖర్చు చేస్తున్నామని ప్రకటించింది. ఈ నిధులను డీఈవోలకు ఇప్పటికే విడుదల చేసింది. అప్పటికప్పుడు వండి వేడిగా ఉండే పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో జిల్లాలో ఒక్కో వంటకాన్ని సాయంత్రం అందించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవోలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అరటిపండుతోపాటు ఏదైనా వేడిగా ఉండే వంటకం అందించాలని నిర్ణయించారు. ఉడికించిన శనగలు, అటుకులు, చుడువ, వేయించిన పల్లీలు, బెల్లం, ఉడికించిన గుడ్డు, రెండు సమోసాలు, బిస్కట్ ప్యాకెట్, పకోడీ, ఉడికించిన పల్లీలు ఇచ్చే అవకాశమున్నది. సోమవారం నుంచి శనివారం వరకు ఒక్కో రోజు ఒక్కో వంటకాన్ని విద్యార్థులకు అందించాలని భావిస్తున్నారు.