Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్కు టీపీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా ఆర్థిక అక్రమాలు చేస్తూ తప్పుడు లెక్కలను సమర్పిస్తూ, నిధులు మళ్లిస్తున్నదనే ఆరోపణలపై విచారణ జరిపించాలని తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్కు ఆ పార్టీ అధ్యక్షురాలు నీరా కిషోర్ నేతృత్వంలో నాయకులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 2017-18, 2018-19, 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో ఆర్థికంగా మెరుగ్గా ఉన్న రాష్ట్రాన్ని ప్రభుత్వం వెనక్కి నెట్టే చర్యలకు పాల్పడిందని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా చూపించిందని ఆరోపించారు. ఈ తప్పుడు సమాచారంతో అధిక వడ్డీలకు, 15 నుంచి 25 ఏండ్ల పాటు చెల్లించేలా కోట్లాది రూపాయల అప్పులు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవకతవలే కాకుండా పలుమార్లు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు లేకుండా పనులకు, స్కీంలకు ప్రజా ధనాన్ని దోచి పెడుతున్నదని విమర్శించారు. వేల కోట్ల రూపాయల చెక్కులు ఆర్థికశాఖ కార్యదర్శి సంతకం లేకుండా (కౌంటర్ సిగేచర్) ఇవ్వడంతో నిధుల స్వాహా అయ్యాయనే అనుమానాన్ని కాగ్ లేవనెత్తిందని గుర్తుచేశారు.
ఆర్థిక అవకతకవకలపై సంబంధిత సంస్థతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ కార్యదర్శులు సనావుల్లా ఖాన్, డాక్టర్ శంకర నారాయణ, ఉపాధ్యక్షులు అశోక్ కుమార్, కార్యవర్గ సభ్యులు మన్మోహన్ రెడ్డి, ఎస్ఎస్.తన్వీర్, సురేష్ కుమార్ పాల్గొన్నారు.