Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతులను డ్రగ్స్‌కు బానిసలుగా చేసి లైంగికదాడులు
- రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతర్జాతీయ ముఠా అరెస్ట్
- 110కిలోల గంజాయి, డ్రగ్స్ స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో / హయత్‌నగర్
హైదరాబాద్‌లో పెద్దఎత్తున డ్రగ్స్.. దాన్ని సరఫరా చేస్తున్న ముఠాలను నార్కొటెక్ ఎన్ఫోర్సుమెంట్ వింగ్‌తోపాటు టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాల సభ్యులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 110కిలోల గంజాయితోపాటు 244గ్రాముల ఎండీఏఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు.
మహారాష్ట్రకు చెందిన డ్రగ్స్ సప్లయర్ వికాస్ మోహన్ కోడ్మూర్ అలియాస్ విక్కీ, జునైద్ షేక్ షంషుద్దీన్, జతిన్ బాలచంద్ర భలేరావు, జావేద్ షంషైర్ అలీ సిద్దిక్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఇదిలా ఉండగా మరో ముఠాకు చెందిన బిల్కిస్ మహ్మద్ సులేమాన్ షేక్ అలీయాస్ గర్ సఫుద్దిన్ రాంపురవాలా, ముర్తుజా షేక్ అలియాస్ షైబాజ్తోపాటు మరో ముఠాకు చెందిన మెహ్రాజ్కాజీ ముంబయిలో డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏజెంట్లను, వినియోగదారులను ఏర్పాటు చేసుకుని గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. సమాచారం అందుకున్న హైదరాబాద్ నార్కొటెక్ ఎన్ఫోర్సుమెంట్ వింగ్‌తోపాటు టాస్క్ఫోర్సు పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. అన్నికోణాల్లో విచారించి మూడు ముఠాలకు చెందిన నిందితులను అరెస్టు చేశారు.
ముంబయి కేంద్రంగా మాదక ద్రవ్యాల సరఫరా దేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. గోవాపై ప్రత్యేక నిఘా వేసి డ్రగ్స్ డాన్లను అరెస్టు చేయడంతో స్మగ్లర్లు రూటు మార్చారని చెప్పారు. గోవా రాష్ట్రం కాకుండా ముంబయి కేంద్రంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారన్నారు. యువతీయువకులకు మాదక ద్రవ్యాలను అలవాటు చేస్తున్నారని తెలిపారు. కొన్ని డ్రగ్స్ 12 నుంచి 16 గంటల వరకు మత్తునిస్తాయి.. ఈ క్రమంలో కొన్ని ముఠాలు యువతులను డ్రగ్స్‌కు, గంజాయికి బానిసలుగా చేసి మత్తులో ఉన్న సమయంలో వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని సీపీ తెలిపారు. ముంబయిలో డ్రగ్స్ సప్లరు దారుల నుంచి నైజీరియన్లు సైతం డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ముంబయిలో డ్రగ్స్ డాన్లతోపాటు డ్రగ్స్ కొనుగోలుదారులు, సరఫరా దారులేకాకుండా వినియోగ దారులను గుర్తించామని తెలిపారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామన్నారు. మాదక ద్రవ్యాల వ్యవహారంలో గోవా పోలీసులు ఎలాంటి సాయమూ చేయలేదన్నారు. ముంబయి పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారని, వారి సహకారంతో డ్రగ్స్ సరఫరాను అడ్డుకుంటామని సీపీ స్పష్టం చేశారు. ఇప్పటికే మాదక ద్రవ్యాల ముఠాపై ముంబయి పోలీసులకు సమాచారమిచ్చామని తెలిపారు. ముంబయి పోలీసుల సాయంతో అక్కడ కూడా దాడులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యక బృందాలు గాలిస్తున్నాయని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్ట్
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఓ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సింథటిక్ డ్రగ్స్, గోల్డ్, ఎలక్ట్రానిక్ గూడ్స్ స్మగ్లింగ్ చేసే ఇద్దరిని నాచారం, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేసినట్టు రాచకొండ సీపీ దేవేందర్ సింగ్ చౌహన్ తెలిపారు. ఎల్బీనగర్లో ఉన్న సీపీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీపీ తెలిపారు. మహమ్మద్ ఖాసీం, రసూల్ డీన్‌తో పాటు మహారాష్ట్రలోని పూణేకు చెందిన షైక్ ఫరీద్ మహమ్మద్, అదే ప్రాంతానికి చెందిన ఫైజాన్ అరుణ్ ముజాహిద్ ముఠాగా ఏర్పడ్డారు. అంతర్జాతీయ కొరియర్ సేవల ద్వారా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు సింథటిక్ డ్రగ్స్‌ను కవర్లలో వేసి, బట్టలతో పాటుగా క్లాత్ బాక్స్ లోపల పొరలలో దాచి జీవీఆర్ ఇంటర్నేషనల్ సర్వీస్ ద్వారా సరఫరా చేసేవారు. గత ఏడాది మహమ్మద్ ఖాసీం, రసూల్ డీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా మిగతా ఇద్దరు మలేషియా నుంచి పూణే, హైదరాబాద్ నగరాల్లో విక్రయాలు చేసేందుకుగాను హైదరాబాద్‌కు రావడంతో విశ్వసనీయ సమాచారం అందుకున్న రాచకొండ నాచారం, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 500గ్రాముల సూడో ప్రెడీన్ (సింథటిక్) గంజాయి, 80గ్రాముల బంగారం, రూ. 2500, పాస్ పోర్ట్, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాటి విలువ రూ.55 లక్షలు ఉంటుందన్నారు. ఆయన వెంట మల్కాజిగిరి డీసీపీ గిరిధర్, ఎల్బీ నగర్ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఎస్ఓటీ ఏసీపీ నరేష్ రెడ్డి, నాచారం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.