Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందు వరుసలో ఉండే కార్మికులకు భద్రత లేదు
- పేదలు ఆక్రమించుకున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలి :
గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) పాదయాత్రలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-దేవరుప్పుల/జనగామ డెస్క్
రెండు పర్యాయాల ఎన్నికల మేనిఫెస్టోల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తానని టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చి విస్మరించిందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. మూడవరోజు పాదయాత్ర సింగరాజుపల్లి గ్రామం నుంచి వనపర్తి, వడ్డిచర్ల, నవాబుపేట, పటేల్ గూడెం గ్రామాల మీదుగా నెల్లుట్లకు చేరుకుంది. ఈసందర్భంగా పటేల్ గూడెం వద్ద గుడిసె వాసులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సింగరాజుపల్లి గ్రామంలో మరణించిన సీఐటీయూ నాయకులు తాటిశెట్టి శంకరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. సింగరాజుపల్లి గ్రామం చౌరస్తాలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో సీఐటీయూ జనగామ జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు అధ్యక్షతన జరిగిన సభల్లో పాలడుగు భాస్కర్ మాట్లాడారు. 300 కిలోమీటర్లు ఐదు జిల్లాల మీదుగా కొనసాగుతున్న ఈ పాదయాత్ర మధ్యలోనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్చలకు పిలవాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఒక్కో కార్మికునికి రూ.15,600 వేతనం ఇవ్వాలని, కారోబార్ బిల్ కలెక్టర్లకు రూ.19,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్లో జీపీ కార్మికుల కోసం నిధులు సవరణ చేసి వెంటనే అమలు చేయాలని కోరారు. కార్మికులు హక్కులను రక్షించుకోవాలంటే.. కార్మిక సంఘాలు ఐక్యమై పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు.
నెల్లుట్ల, పటేల్ గూడెం గ్రామాల మధ్య నిరుపేదలు ఆక్రమించుకున్న భూములకు ఇండ్లకు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, పూర్తయిన వాటిని లబ్దిదారులకు ఇవ్వకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని తెలిపారు. ఈ సందర్భంగా సమస్యలపై కార్మికులు నుంచి వినతులు స్వీకరించారు. తమ సమస్యల కోసం పాదయాత్ర చేస్తున్న నాయకులకు మంగళహారతులతో బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు గ్యార పాండు, చాగంటి వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గణపతి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు తునికి మహేష్, వినోద్ కుమార్, జనగామ జిల్లా అధ్యక్షులు బత్తిని వెంకన్న, మండల అధ్యక్షులు రామచందర్, కార్యదర్శి గనగాని ఉప్పలయ్య, గ్రామ సిబ్బంది సోమరాజు, నాగేష్, రాజు, సైదమ్మ, కళమ్మ, పరమేష్, సాయిలు, సోమన్న, మధు తదితరులు పాల్గొన్నారు.