Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల, మతాంతర వివాహాలే శ్రేయస్కరం
- సమాజ మార్పులో భాగం కావాలి : ఆదర్శ వివాహితుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రొఫెసర్ కాశీం
- కుల, మతాంతర వివాహితుల పారితోషికాన్ని రూ.10 లక్షలకు పెంచాలని తీర్మానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశాభివృద్ధికి కులమే ప్రధాన శత్రువుగా, అడ్డంకిగా మారిందని కవి, ప్రొఫెసర్ సి.కాశీం ఆవేదన వ్యక్తం చేశారు. కుల, మతాంతర వివాహాలను ప్రోత్సహించడం సామాజిక బాధ్యతగా మారాలనీ, సమాజ మార్పు కోసం జరిగే కార్యాచరణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. కులాంతర్గత( ఒకే కులంలోని వారి మధ్య) వివాహాలతో పిల్లల్లో జ్ఞానం ఎదుగుదలలో కుంటుదనం ఏర్పడుతుందని నొక్కి చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల నిర్మూలన సంఘం, కులాంతర వివాహి తుల సంక్షేమ సంఘం, ఎస్వీకే సం యుక్త ఆధ్వర్యంలో ఆదర్శ వివాహితుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. కుల, మతాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం ఇస్తున్న రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పారితోషికాన్ని పెంచాలని తీర్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాశీం మాట్లాడు తూ..ప్రేమిస్తే నేరం, ప్రేమిస్తే కొడతాం, చంపుతాం అనే వారి సంఖ్య సమాజంలో రోజురోజుకీ పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రేమించే వారికి కూడా మనుషులు అండగా ఉంటారనే ఆత్మస్థైర్యాన్ని ఇలాంటి వేదికలు కల్పించాలని కోరారు. ప్రేమించుకున్న జంటలపై జరుగుతున్న దాడుల వెనుక కుల దురంహకారమే కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల ప్రభావం ఎలా ఉందనే దానిపైనా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. వ్యక్తిగత ఆస్తి, పూజారి వర్గం పుట్టుక నుంచి పురుడుపోసుకున్న వివక్ష, అణచివేతలు.. మనువు వచ్చాక చట్టరూపంగా మారిన తీరును వివరించారు. కులాంతర వివాహాలు విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కులాంతర వివాహాలు పెరుగుతు న్నప్పటికీ...దానికి రెట్టింపు స్థాయిలో నేటి సమాజంలో గ్రేటర్ కమ్యూనిటీలు, సంఘాల రూపంలో కులం మరింత ఘనీభవిస్తున్న తీరును వివరించారు.
ఇది సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. పిల్లల్లో ప్రేమను ప్రోత్సహించే సమాజం రావాలని ఆకాంక్షించారు. ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్.వినయకుమార్ మాట్లాడుతూ.. కులాంతర, మతాంతర వివాహితుల పరిరక్షణ చట్టం తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాజస్థాన్లో బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి చట్టం తెచ్చిందని గుర్తుచేశారు. ప్రేమ పెండ్లిండ్లు చేసుకున్న వారికి అన్ని సందర్భాల్లోనూ పోలీసులు అండగా నిలబడటం లేదన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. ప్రపంచంలో కులం ఏ దేశంలోనూ లేదనీ, అది మనుషులు సృష్టించినదేనని అన్నారు. స్వకుల వివాహాలు మురికి కుంటలో నిల్వ ఉండే నీళ్లలాంటివనీ, కులాంతర వివాహాలు పారుతున్న సెలయేరు లాంటి స్వచ్ఛమైనవని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే పారితోషికం కులాలతో నిమిత్తం లేకుండా అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కుల దురంహంకార హత్యల నివారణకు శాశ్వత కమిషన్ను, సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే వారికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కులం కంటే గుణం మిన్న, మతం కంటే మానవత్వం గొప్పదనే రోజులు రావాలని ఆకాంక్షించారు. కుల నిర్మూలన సంఘం గౌరవాధ్యక్షులు గుత్తా జ్యోత్న్స మాట్లాడుతూ.. కులం ఉండాలని బలంగా కోరుకునే చినజీయర్ స్వామి లాంటి వారికి పద్మశ్రీ అవార్డు దక్కుతున్న సమాజంలో మనం ఉన్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కులాంత వివాహాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తమ సొంతూరు అయిన పుష్పగిరి లో అన్నీ కులాంతర వివాహా లేనని వివరించారు. అద్దంకి నాగమణి మాట్లాడుతూ.. సమాజంలో ఎక్కువ కులం, తక్కువ కులం అనే బేధ భావనల ను సృష్టించింది మనుషులేనన్నారు. వాటిని మనమే బద్ధలు కొట్టాలన్నారు. మనిషి దొరికింది తినడం.. అలసి పోయాక పడుకోవడం లాంటి దశ నుంచి నేటి వరకు జరిగిన సమాజ పరిణామ క్రమాన్ని వివరించారు. కుల నిర్మూలన సంఘం అధ్యక్షులు వాహిద్ మాట్లాడుతూ...కుల, మతాంతర వివాహితులకు పుట్టే పిల్లలను ఆదర్శ భారతీయులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశా ల్లో ప్రత్యేక కోటాలో 2 నుంచి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. కుల, మతాంతర వివాహాలను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మేళనానికి అధ్యక్ష వర్గంగా కె. సుజావతి, వై.జ్యోతి, ఎస్. తులసి వ్యవహరించారు. కుల, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలను ఈ సందర్భంగా సత్కరించారు. షార్ట్ఫిలిమ్ లను ప్రదర్శించారు. పాటలు ఆలపించారు. కార్యక్రమం లో ఎన్.సోమయ్య, దశరథ్, కవిత, తదితరులు పాల్గొన్నారు.