Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్షాలపై బీజేపీ హింసాదాడులను అరికట్టాలి
- ఆస్తులు కోల్పోయినా, హత్యలకు గురైనా కార్యకర్తలు, ప్రజలు ఎర్రజెండాను వదల్లేదు
- వారి నుంచి మనమంతా స్ఫూర్తి పొందాలి : తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-సిటీబ్యూరో
త్రిపురలో నేడు జరిగే ఎన్నికలను స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరపాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. వామపక్షాలపై బీజేపీ హింసాదాడులను అరికట్టాలన్నారు. సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం బాగ్‌లింగంపల్లి ఎస్వీకేలోని దొడ్డి కొమరయ్య హాల్లో సభ జరిగింది. నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో తమ్మినేని మాట్లాడారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో బీజేపీ ప్రభుత్వం త్రిపురలో అప్రజాస్వామిక పద్ధతులు అనుసరిస్తోందని, ఆ పార్టీ దమనకాండను అరికట్టాలన్నారు. త్రిపురలో ప్రతిపక్షాలతోపాటు వారిని అడ్డుకునే శక్తులను లేకుండా చేయాలని బీజేపీ దుర్మార్గపు ఆలోచన చేస్తుందన్నారు. ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీకి పట్టిన గతే బీజేపీ చీకటి పరిపాలనకు పడుతుందని హెచ్చరించారు. అదానీ ఆర్థిక అవకతవకలపై హిండెన్ బర్గ్ వెల్లడించినా.. బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం అదానీ-మోడీల బంధాన్ని బహిర్గతం చేస్తున్నదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎస్బీఐ నుంచి అదానీ సంస్థలు వేలకోట్ల రూపాయల రుణాలు తీసుకుని.. కృత్రిమ లాభాలు చూపించే ప్రయత్నం చేశాయని, దేశ సంపదను దోపిడీ చేయడమూ దేశం కోసమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి ప్రయత్నించిన ఎవరైనా చరిత్ర గర్భంలో కలిసి పోవాల్సిందేనని.. ఇదే గతి మోడీ, కాషాయ కూటమికీ పడుతుందని హెచ్చరించారు. త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీవ్రమైన హింసాకాండ కొనసాగుతున్నదని, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై, ప్రజలపై దాడులు చేస్తూ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అండదండలతో బీజేపీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఒకపక్క మోడీ ప్రతిష్ట రోజు రోజుకీ దిగజారుతుండగా త్రిపురలో ఏదో రకంగా ఎన్నికల్లో గెలిచి ప్రజల దృష్టి మరలించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇన్ని దౌర్జన్యాలు, ఆస్తులు ధ్వంసం చేసినా, హత్యలు, లైంగికదాడులు చేసినా అక్కడి ప్రజలు, కార్యకర్తలు ఎర్రజెండాను వదలలేదన్నారు. వారి నుంచి ఆ స్ఫూర్తిని మనము పొందాలన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు మాట్లాడుతూ.. త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2 వేల సీపీఐ(ఎం) ఆఫీసులను ధ్వంసం చేసిందన్నారు. 600 మంది కార్యకర్తలను హత్య చేయించిందన్నారు. అంతేగాక ఆ రాష్ట్ర మాజీ సీఎం, సీపీఐ(ఎం) నేత మాణిక్ సర్కారుపై దాడులకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. మహిళలపైనా ఎన్నడూ లేని విధంగా హత్యలు, లైంగికదాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇంత నిర్బంధంలోనూ అక్కడి ప్రజలు, పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ప్రజాసమస్యలపై పనిచేస్తున్నారన్నారు.
నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీజేపీ, మోడీ దౌర్జన్యాలు, అరాచకాలను అడ్డుకోవాలన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారని, ఇది మంచి పరిణామమేనని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపైనా తాము పోరాడుతున్నామని చెప్పారు.
నగర కార్యదర్శివర్గ సభ్యులు కె.నాగలక్ష్మి మాట్లాడుతూ హిండెన్ బర్గ్ నివేదిక, అదానీ అక్రమాలతో అబాసుపాలవుతున్న తరుణంలో త్రిపురలో ఎలాగైనా గెలవాలని బీజేపీ, మోడీ ప్రభుత్వం దాడులు అరాచకాలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.దశరథ్, ఎం.శ్రీనివాస్‌రావు, ఎం.మహేందర్, ఎం.వెంకటేష్, కె.ఎన్.రాజన్న, మాజీ నగర కార్యదర్శి పీఎస్ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.