Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'గిరిజన గురుకులాల'పై హైకోర్టు తీర్పు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో పనిచేసే బోధనా సిబ్బందికి పెద్ద ఎత్తున మేలు జరిగేలా హైకోర్టు తీర్పు వెలువడింది. సర్వీసులో చేరిన తేదీ నుంచే పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా కాంట్రాక్టు సర్వీసులో చేరిన తేదీ నుంచే వారికి సర్వీసు క్రమబద్ధీకరణ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. రుషికేష్ కుమార్ మరో 120 మంది దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ ఇటీవల తీర్పును వెలువరించారు.
2000 నుంచి 2003 మధ్యకాలంలో కాంట్రాక్టు విధానంలో భాగంగా సర్వీసులో చేరిన బోధనా సిబ్బందిని ప్రభుత్వం 2008లో క్రమబద్ధీకరించింది. 2004 తర్వాత పెన్షన్ స్కీమ్ లేదని చెప్పి వాళ్లను కంట్రిబ్యుటర్ పెన్షన్ స్కీంలోకి తీసుకొస్తూ 2018లో సర్క్యులర్‌ను జారీ చేసింది. 2018 డిసెంబర్ 18న ఇచ్చిన ఆ సర్క్యులర్‌ను సవాల్ చేసిన పిటిషన్‌పై హైకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది. వారందరికీ రెగ్యులర్ సర్వీస్ బెనిఫిట్స్ కల్పించాలి..నియామక తేదీ నుంచే కంట్రిబ్యూటరీ పెన్షన్‌ను అమలు చేయాలి..కాంట్రాక్ట్ సర్వీస్ నియామక తేదీని ఆధారంగా చేసుకుని సర్వీస్‌ను లెక్కించాలి..ఇదే ప్రామాణికం..ఇదే విషయాన్ని పేర్కొంటూ ఉమ్మడి ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2004 తర్వాత పెన్షన్ స్కీమ్ లేదని చెప్పి అప్పటికే పనిచేస్తున్న వారికి స్కీమ్‌ను వర్తించబోమని చెప్పడం సరికాదు. 2002 నుంచి చేస్తుంటే 2008లో రెగ్యులరైజ్ అయ్యారని చెప్పటం చెల్లదు. కాంట్రాక్ట్ విధాన నియాకమ తేదీ నుంచే సర్వీసును లెక్కించాలి. వీరంతా గురుకుల సొసైటీ కిందకు వస్తారని చెప్పడం సరికాదు. వీళ్లందరికీ ప్రభుత్వ సంచిత నిధి నుంచే జీతాల చెల్లింపు ఉంది. కాబట్టి గతంలో ఇదే హైకోర్టు శ్రీలక్ష్మి, ఏపీ ప్రభుత్వం మధ్య కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం పిటిషన్లను ఆమోదిస్తున్నాం... అని హైకోర్టు స్పష్టం చేసింది.
గజ్వేల్ అవిశ్వాసంపై స్టే...
గజ్వేల్ మున్సిపల్ చైర్మెన్ చిన రాజమౌళిపై 20 మంది ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన అమలుపై హైకోర్టు జస్టిస్ భాస్కర్‌రెడ్డి స్టే విధించారు. రద్దయిన చట్ట నిబంధనల కారణంగా గతంలో పలు మున్సిపాల్టీల చైర్మెన్లకు సంబంధించిన అవిశ్వాస తీర్మాన నోటీసులపై స్టే ఇచ్చినట్టుగానే గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ కేసులోనూ స్టే ఇస్తున్నట్టు తెలిపారు. విచారణను 21వ తేదీకి వాయిదా వేశారు.
ఈడబ్ల్యుఎస్ను అమలు చేయాలి
పీహెచ్డీ ఇతర ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లను (ఈడబ్ల్యూఎస్) అమలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ఆదేశించారు. పీహెచ్డీ అడ్మిషన్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు లేకపోవడంపై రంగారెడ్డి జిల్లా చింతల్‌కు చెందిన పీహెచ్డీ దరఖాస్తుదారుడు ఎన్.ఉమ వేసిన పిటిషన్‌పై ఈ ఉత్తర్వులను జారీ చేశారు.