Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘటనా స్థలాన్ని సందర్శించిన ద.మ.రైల్వే జీఎమ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ 12727) బీబీనగర్, ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు తప్పిన ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఉదయం 06.10 గంటలకు గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిందనీ, రైలులోని ఎస్ 4 నుంచి ఎస్- 1 వరకు నాలుగు స్లీపర్ క్లాస్ బోగీలు, ఒక జనరల్ బోగీ, ఒక లగేజీ కమ్ బ్రేక్ వ్యాన్ పట్టాలు తప్పాయని వివరించారు. మిగిలిన 16 బోగీలకు ఎలాంటి నష్టం జరగలేదనీ, అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే పరిస్థితిని సంబంధిత అధికారులకు తెలిపారని వివరించారు. వెంటనే సహాయ చర్యలతో పాటు పునరుద్ధరణ పనులను చేపట్లేందుకు వైద్య సిబ్బందితో సహా రైల్వే అధికారుల బందం యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ (ఏఆర్టీ), మెడికల్ రిలీఫ్ వ్యాన్ (ఎంఆర్వి) సంఘటనా స్థలానికి చేరుకొని తగిన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు. పట్టాలు తప్పిన కోచ్‌లలోని ప్రయాణికులను దెబ్బతినని బోగీలలోకి తరలించి, ఉదయం 8.40 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు రైలు చేరుకుందని తెలిపారు. సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేసి 040-27786666 ఫోన్ నెంబర్ ద్వారా వివరాలను అందించామనీ, సికింద్రాబాద్ స్టేషన్లో మెడికల్ కిట్లతో అదనంగా వైద్య బందాలను సిద్ధంగా ఉంచినట్టు వివరించారు. ఈ సందర్భంగా 9 రైళ్లు రద్దు కాగా మరో 19 రైళ్ళను పాక్షికంగా రద్దు చేశామన్నారు. 7 రైళ్లు సమయ వేళల్లో మార్పు, 6 రైళ్లు ఇతర మార్గాల ద్వారా దారి మళ్లించినట్టు చెప్పారు. రద్దు చేసిన రైళ్లలోని ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్, నల్గొండ స్టేషన్లలో ప్రత్యేక రిఫండ్ కౌంటర్లు ఏర్పాటు చేశామనీ, ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.