Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్ఎస్, బీజేపీ వికృత రాజకీయ క్రీడ
- విలేకరుల సమావేశంలో స్వేచ్ఛ జేఏసీ కన్వీనర్ టి.రమేష్
- భయపడేదిలేదు : రెంజర్ల రాజేష్
- చందా ఇవ్వలేదనే దాడి : టీచర్ మల్లికార్జున్
నవతెలంగాణ-సిటీబ్యూరో
'నాస్తికులు, వామపక్షవాదులు, అభ్యుదయ వాదులు, ప్రశ్నించే వారిపై దాడులు చేసి, హత్యలు చేసి అధికారంలోకి రావడానికి ఇది కర్ణాటక కాదు. పోరాటాల గడ్డ.. తెలంగాణ అడ్డా.. ఇక్కడ మీ ఆటలు సాగవు' అని స్వేచ్ఛ జేఏసీ కన్వీనర్ టి.రమేష్ హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్‌కేలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భేదాభిప్రాయలు ఉంటే చట్ట ప్రకారం వెళ్లాలి తప్ప చట్టాన్ని చేతిలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. కర్ణాటక, ఉత్తర భారతదేశం తరహాలో తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్‌దళ్, మతోన్మాద సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. కుట్రపూరితంగా దాడులు చేసి, మతోన్మాద గొడవలకు దారి తీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. నిజాం నిరంకుశ పాలనను ఎదురించి విజయం సాధించిన గడ్డ ఇది అని, సమ్మక్క సారక్క పుట్టిన గడ్డ అని అన్నారు. భైరి నరేష్ వెంట తిరిగే వారి మీద కూడా దాడులు చేస్తున్నారని, దశాబ్దాలుగా ఉన్న పాటలే పాడుతున్న రెంజర్ల రాజేష్‌పై దాడి చేశారని, 'మాకు సరస్వతి దేవతలు లేరు, వారు మాకు చదువు చెప్పలేదు, మాకు చదువు చెప్పింది సావిత్రి బాయిపూలే' అన్న మల్లికార్జున్పైనా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పక్షపాత ధోరణి అవలంబిస్తూ, బాధితులపైనే కేసులు పెడుతున్నారని, ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. బాధితులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. మనుస్మృతి మళ్లీ తెచ్చి హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని, 18వ తేదీ భాగ్యరెడ్డి వర్మ వర్ధంతి సందర్భంగా ఆయన పాఠం బహిరంగంగా రాష్ట్ర వ్యాప్తంగా చెబుతామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని సవాల్ విసిరారు.
కోకన్వీనర్ ఝాన్సీ(పీఓడబ్ల్యూ) మాట్లాడుతూ.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడులు పెరిగాయన్నారు. ప్రేమ పెండ్లీలు చేసుకున్నవారిపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ విజరుకుమార్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్థలకు సైద్ధాంతికంగా ఎదుర్కొనే దమ్ములేక భౌతికదాడులకు పాల్పడుతున్నాయన్నారు. అడ్వకేట్ సురేష్ మాట్లాడుతూ.. దేశంలో ఆజాదీ నినాదం మతోన్మాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిందన్నారు. బైరి నరేష్, మల్లికార్జున్, రెంజర్ల రాజేష్ ఘటనల్లో పోలీసులు ఉద్దేశపూర్వకంగా బాధితులపై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.
భయపడేదిలేదు..
రాజ్యాంగబద్ధమైన పోరాటాలకు ఆటంకాలు కలిగిస్తున్నారంటే, రాజ్యాంగం లేనప్పుడు ఈ మతోన్మాదులు ఎంత రెచ్చిపోయారో అర్థం చేసుకోవాలని సమత సైనిక్ దల్ నేత రెంజర్ల రాజేష్ అన్నారు. ప్రశ్నించే తత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, కానీ.. ఎవరో భయపడితే భయపడే వాళ్లం కాదన్నారు.
చందా ఇవ్వలేదనే అక్కసు: టీచర్ మల్లికార్జున్
'సరస్వతి మాతను నమ్ముకుంటే చదువు రాదు. విదేశాల్లో సరస్వతి మాత ఉందా? వారికి చదువు రావడం లేదా? మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి.. ఎప్పుడో నాలుగు నెలల కిందట అన్న మాటను అడ్డుపెట్టుకుని, వినాయక చందా ఇవ్వలేదని నాపై దాడి చేసి, బలవంతంగా పూజలు చేయించారు' అని కోటగిరి టీచర్ మల్లికార్జున్ అన్నారు. ఈ సమావేశంలో స్వేచ్ఛ జేఏసీ కోకన్వీనర్లు కోలా జనార్దన్, బొల్లి ఆదాంరాజు, ఫూలే స్పోకెన్ ఇంగ్లీష్ సంఘం నాయకులు రషీద్ ద్రావిడ, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అశోక్‌రెడ్డి, పీడీఎస్‌యూ నేత మహేష్ తదితరులు పాల్గొన్నారు.