Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పాల రైతులకు బకాయిలతో పాటు ప్రోత్సాహకాలు విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. రైతులకు నాలుగు రూపాయల ప్రోత్సాహకాలను 2020 మార్చి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసిందని పేర్కొంది. ఈమేరకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్రావు, టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతియేటా బడ్జెట్లో వాటి కోసం రూ. 75.50 కోట్లు కేటాయించినప్పటికి రైతులకు చెల్లించడం లేదని పేర్కొన్నారు. సహకార సంఘాల్లో పాలుపోసే రైతులకు చెల్లించాల్సిన నిధులను ఆపేసిందని తెలిపారు. రాష్ట్రంలో 26 లక్షల కుటుంబాలు పశుపోషణపై ఆధారపడి ఉన్నాయనీ, విజయ, ముల్కనూరు, కరీంనగర్, మదర్ సహకార పాల కేంద్రాలకు పాలుపోసే రైతులకు 3.50 లక్షల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. పాడి ఆవుల ను, గేదెలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ కూడా తగ్గించిందని విమర్శించారు. పశుబీమా ప్రీమియం చెల్లింపుల కోసం ఎంతో మంది రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. సహకార పాడి పరిశ్రమ ద్వారా తమకు కొంత గిట్టుబాటు ధర వస్తుందని ఆశించిన రైతులకు గత రెండేండ్లకుపైగా ప్రభుత్వ సహకారం నిలిపివేయడం సరికాదని వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలను, బీమా ప్రీమియాన్ని అమలు చేయడంతో పాటు పాల రైతులకు ప్రోత్సాహక నిధులను కేటాయించిన లీటరుకు నాలుగు రూపాయలను వెంటనే చెల్లించాలనీ, ఆ డబ్బులను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని కోరారు.