Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని.. ఇకనైనా ఆ విధానాలు మానుకోవాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేశ్ డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం రెండో రోజు బుధవారం నల్లగొండ పట్టణంలోని స్టే ఇన్ హోటల్లో రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రెండు కోట్ల ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని కోరారు. కొత్త ఉద్యోగాల కల్పన మీద దృష్టి పెట్టకపోగా ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికమాంద్యం ముంచుకొస్తుందని, ఉద్యోగ భద్రత కరువైందని అన్నారు. కార్పొరేట్ల మీద అజమాయిషీ లేకపోవడంతో రాత్రికి రాత్రే ఉద్యోగాలు తొలగిస్తున్నారన్నారు. దేశంలో అధిక శాతం ఉన్న యువత అభివృద్ధిపై ప్రభుత్వానికి ప్రణాళిక లేదన్నారు. యువజన వ్యతిరేక విధానాలపై ఇతర యువజన సంఘాలను కలుపుకొని మార్చి నెలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లన్నింటినీ భర్తీ చేయాలని కోరారు. నలగొండ, ఇతర జిల్లాల్లో పెండింగ్లో ఉన్న ఐటీ నిర్మాణపనులను వెంటనే పూర్తి చేసి ఉద్యోగాలు కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ మల్లం మహేష్, బషీరుద్దీన్, గడ్డం వెంకటేశ్, జగన్, శివవర్మ, వివిధ జిల్లాల కార్యదర్శులు ప్రవీణ్, శ్రీకాంత్, నవీన్, జావీద్, తిరుపతి, చింతల రమేష్, మద్దెల ప్రభాకర్, నాగటి ఉపేందర్, నల్లగొండ జిల్లా నాయకులు గుండాల నరేష్, జిట్టా రమేష్, వడ్డగాని మహేష్, పాలాది కార్తీక్, కార్లపూడి రాము, ప్రసాద్,ఆమనగంటి వేణు, గర్ల్స్ కన్వీనర్లు సంధ్య, రేణుక, మమత పాల్గొన్నారు.