Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీ ఉద్యోగులకిచ్చిన హామీలను నెరవేర్చాలి : సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐసీడీఎస్‌ను అభివృద్ధిపర్చాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. వారికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత వంటి చట్టబద్ధమైన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఆయన బుధవారం లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు 40 ఏండ్లకుపైగా ఐసీడీఎస్‌లో పనిచేస్తున్నారని తెలిపారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని గుర్తు చేశారు. కర్నాటకలో హెల్త్ కార్డులిచ్చారని పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్, కేరళలో కనీస వేతనాలు, ఉద్యోగ విరమణ సౌకర్యాలు, పెన్షన్, పండుగ బోనస్ సౌకర్యాలు కల్పిస్తున్నారని వివరించారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించుకుని ఇచ్చిన హామీలైనా అమలు చేయకపోవడంతో వారు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. వారు ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద కుటుంబాలకు చెందినవారేనని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్లతో సమానంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 2018 అక్టోబర్‌లో కేంద్రం పెంచిన వేతనం అంగన్వాడీ టీచర్లకు రూ.1,500, హెల్పర్లకు రూ.750, మినీ వర్కర్లకు రూ.1,250 రాష్ట్ర ప్రభుత్వం బకాయిలతో సహా చెల్లించాలని కోరారు. 2017 నుంచి టీఏ, డీఏ, ఇంక్రిమెంట్, ఇన్ఛార్జ్ అలవెన్సు బకాయిలు, పీఆర్సీ బకాయిలను చెల్లించాలని తెలిపారు. మూడేండ్ల రేషన్‌షాపు రవాణా ఛార్జీలను ఇవ్వాలని పేర్కొన్నారు. ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు పిల్లలకు రూ.1.15 పైసల నుంచి రూ.ఐదుకు, గర్భిణీ/బాలింతలకు రూ.2.40 పైసల నుంచి రూ.10కి పెంచాలనీ, డబుల్ సిలిండర్లు ఇవ్వాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని తెలిపారు. వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలని కోరారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తెలిపారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా గుర్తించాలని పేర్కొన్నారు. మదర్స్ కమిటీ చైర్మెన్‌గా సర్పంచులకు బదులుగా తల్లులను నియమించాలని తెలిపారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ, ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ డిమాండ్ చేశారు.