Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)
నవతెలంగాణ-జనగామ డెస్క్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పాదయాత్ర హైదరాబాద్ చేరకముందే ముఖ్యమంత్రి పాదయాత్ర బృందాన్ని చర్చలకు పిలవాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర బుధవారం జనగామ పట్టణానికి చేరుకుంది. జనగామ కలెక్టరేట్ వద్ద పాదయాత్ర బృందానికి గ్రామపంచాయతీ కార్మికులతో పాటు ఆయా ప్రజా సంఘాల నాయకులు, వివిధ కార్మిక సంఘాల కార్మికులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఆర్టీసీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి బంద సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు అధ్యక్షతన జరిగిన సభలో పాలడుగు భాస్కర్ మాట్లాడారు. జనగామ జిల్లాలో నాలుగు రోజులపాటు మూడు నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో 26 గ్రామాల్లో పాదయాత్ర కొనసాగిం దని తెలిపారు. గ్రామాల్లో పారిశద్ధ్య పనులు నిర్వహించే కార్మికులను 2011 జనాభా లెక్కల ప్రకారం 500 మందికి ఒకరిని నియమించారని, ఈ 12ఏండ్లలో జనాభా పెరిగినా వారికి తగ్గట్టుగా కార్మికులను పెంచలేదని ఆరోపించారు. తెలంగాణ లో మల్టీపర్పస్ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల కారో బార్ల పరిస్థితి దీనంగా మార్చిందని విమర్శిం చారు. ఆయా రంగాల్లో పదోన్నతులు, గ్రేడింగ్‌లు ఉన్నట్టుగానే గ్రామపంచాయతీల్లోనూ పునరుద్ధరిం చాలని డిమాండ్ చేశారు. జీవో 60 ప్రకారం జీపీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు అమలుచేసి వారి పనికి భద్రత కల్పించాలన్నారు.
పాదయాత్ర ముగి సేలోగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. పాదయాత్రలో బృందం సభ్యులు, యూనియన్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు గ్యార పాండు, చాగంటి వెంకటయ్య, నాయకులు పి.గణపతి రెడ్డి, తునికి మహేష్, పి.వినోద్ కుమార్‌తోపాటు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు వెంకటేష్, చంద్రశేఖర్, శ్రీకాంత్, పాలడుగు సుధాకర్, వై.సోమన్న, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోకు కనకా రెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్, ఐద్వా రాష్ట్ర నాయకులు ఇర్రి అహల్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్రకు వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డ్ యూనియన్ సంఘీభావం
నవతెలంగాణ- వరంగల్
గ్రామ పంచాయితీ సిబ్బంది కనీస వేతనం రూ.26,000 లు ఇవ్వాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని తదితర డిమాండ్లపై చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల పాదయాత్రకు వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ సంఘీభావం తెలిపింది. బుధవారం జనగామలో పాదయాత్ర బృందానికి స్వాగతం పలికి పూలమాలతో సత్కరించి, సంపూర్ణ మద్దతు తెలిపారు. సెక్యూరిటీ గార్డ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పాలడుగు భాస్కర్‌కు వినపతిపత్రం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లలో పనిచేస్తున్న 1,200 మంది సెక్యూరిటీ గార్డులకు థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా వ్యవసాయ మార్కెట్ కమిటీలే వేతనాలు చెల్లించాలని, కార్మికశాఖ విడుదల చేసిన జీఓ నెం. 21ని గెజిట్ చేసి సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనాలు అమలు చేసే విధంగా కృషి చేయాలని కోరారు. మద్దతు తెలిపిన వారిలో.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటల సోమన్న, జిల్లా అధ్యక్షులు వెంకటేష్, జిల్లా కార్యదర్శి బత్తిన వేణు, ఉపాధ్యక్షులు కుమారస్వామి, కార్యవర్గ సభ్యులు ప్రవీణ్, లక్ష్మయ్య ఉన్నారు.