Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర స్థాయి రైల్వే సెక్యూరిటీ కమిటీ సమావేశంలో డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రైల్వే స్టేషన్లలో నేరస్థుల కదలికలు, వారి కుట్రలపై భద్రతా అధికారులు ఎల్లప్పుడు అప్రమత్తంగా మెలిగి వారి కుయుక్తులను పటాపంచలు చేయాలని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ పిలుపు నిచ్చారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి రైల్వే భద్రతా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన ప్రసంగించారు. ఈ సంధర్భంగా నడుస్తున్న రైళ్లపై రాళ్ల దాడి, రైళ్లలో దొంగతనాలు, మహిళల అక్రమ రవాణ నిరోధం, సీసీ కెమెరాల ఏర్పాటు, రైల్వే పోలీసు, జీఆర్పీ పోలీసు మధ్య సమన్వయం, రైల్వే పట్టాల భద్రత తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రైళ్లలో జరుగుతున్న చైన్ స్నాచింగ్‌లు, సెల్ఫోన్ల చోరీలు, రైలు పట్టాల వద్ద చోటు చేసుకునే ప్రమాదాలు మొదలుకుని రైల్వే లైన్ల వద్ద నివసించే వారి భద్రత తదితర అంశాలపై షార్ట్ ఫిలింను చిత్రించి ప్రజలకు అవగాహన కల్పించాలని డీజీపీ సూచించారు. అలాగే రైల్వే యాక్సిడెంట్లు జరిగే బ్లాక్ స్పాట్లను గురించి వాటి వద్ద తగిన నివారణ చర్యలు తీసుకునేలా చర్యలు సాగాలని ఆయన కోరారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులకు చెందిన సీసీ కెమెరాల మధ్య కూడా సమన్వయాన్ని పెంచడం ద్వారా రైల్వే స్టేషన్లలో నేరాల అదుపునకు కృషి చేయాలని ఆయన చెప్పారు.
ఐఆర్సీటీసీ గుర్తింపు లేకుండా ఆన్లైన్లో రైల్వే టిక్కెట్లను బుకింగ్ చేసే మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రైళ్లలో గంజాయి, ఇతర మాదక పదార్థాలను రవాణా చేసే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు సాగాలని ఆయన అధికారులను కోరారు. రైల్వే ట్రాక్‌లు, ఫ్లాట్ ఫామ్‌ల వద్ద గుర్తు తెలియని శవాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియ చేసేలా ప్రకటలు చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా భద్రతా కమిటీ చేసిన పలు సూచనలు అమలు జరిగేలా అధికారులు నిశితమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైల్వే పోలీసు అదనపు డీజీ శివధర్‌రెడ్డి, శాంతి భద్రత ల విభాగం అదనపు డీజీ సంజరు జైన్‌తో పాటు రైల్వే విభాగం భద్రతాధికారులు, జీఆర్పీ అధికారులు , రైల్వే ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.