Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోరాటాలు..సేవా ధృక్పధంతో సంఘ విస్తరణ : కార్యదర్శి నివేదికలో వెంకట్
- కొనసాగుతున్న వ్యవసాయ కార్మికసంఘం మహాసభ
జ్యోతిబసు నగర్ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల కారణంగా గ్రామీణ భారతం అతలాకుతలమవుతోందనిఅఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ తెలిపారు. హౌరాలోని జ్యోతిబసునగర్(శరత్శ్చంద్ర ఆడిటోరియం)లో జరుగుతున్న 10వ మహాసభలో ఆయన కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. కేంద్ర విధానాల కారణంగా వ్యవసాయ రంగం గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షోభంలో చిక్కుకుందని, దాని ఫలితం వ్యవసాయ కార్మికులపై తీవ్రస్థాయిలో పడుతోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయి, పెద్ద సంఖ్యలో వ్యవసాయ కార్మికులు పట్టణాల బాట పట్టాల్సివచ్చిందని చెప్పారు. కరోనా కాలంలో పట్టణాల్లో సైతం పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. అదే సమయంలో బిలియనీర్లు పెరిగారని, దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని చెప్పారు. మరోవైపు ఫాసిస్టు దాడులూ పెరుగుతున్నాయని, దీనికి బలవుతోందని కూడా నిరుపేదలు, వ్యవసాయ కార్మికులేనని అన్నారు. భూమిలేని పేదల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అన్నారు. వ్యవసాయ కార్మికులతోపాటు చిరు ఉద్యోగులూ ఉపాధిని కోల్పోయారని వివరించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేయడంతోపాటు, సేవా ధృక్పధంతో వ్యవసాయ కార్మికసంఘం వ్యవహరిస్తోందని, ఫలితంగా సంఘ సభ్యత్వం గణనీయంగా పెరుగుతోందని అన్నారు. 2020లో కన్నూరులో జరిగిన మహాసభ అనంతరం దేశ వ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుందని తెలిపారు. కేరళలో 22 లక్షలు, బెంగాల్లో 19 లక్షల సభ్యత్వం ఉందని వివరించారు. అలాగే తమిళనాడు, తెలంగాణా, తమిళనాడు, త్రిపుర, బీహార్, అస్సాం ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ క్రమంగా సభ్యతాన్ని పెంచుకుంటున్నామని వివరించారు. బెంగాల్ వంటి రాష్ట్రంలో ఒక్కరోజులోనే ఐదు లక్షల సభ్యత్వం చేర్పించారని, ఉద్యమం ప్రభావం, ఫలితం ఉండటంతోనే అనేకమంది సంఘంలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అన్నారు. కేరళ రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అక్కడ పేదలకు గృహ నిర్మాణంలో సంఘం కీలకపాత్ర పోషించిందన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా వంటి రాష్ట్రాల్లో వందల సంఖ్యలో పేదలు నివశించే ప్రాంతాల్లో పర్యటించి వారి ఇబ్బందులు తెలుసుకోవడంతోపాటు వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణాలో వరంగల్ నగరంలో నిర్వహించిన ఉద్యమం మంచి స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ పేదల కాలనీల్లో పర్యటించి సర్వే చేశారని, దీని ఫలితంగా నిజమైన లబ్దిదారులు ఎవరో ప్రభుత్వానికి తెలిసొచ్చి న్యాయం జరుగుతోందని అన్నారు. కరోనా కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన నాయకత్వం సేవా కార్యక్రమాలు చేయడంతోపాటు నిధులు సేకరించి కోవిడ్ బారినపడిన వారికోసం సేవలందించిందని తెలిపారు.బిజెపి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకోవడంతోపాటు, కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించాల్సి ఉందని మహాసభ వేదికగా పిలుపునిచ్చారు.