Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ కే.వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్రను బ్రెయిలీ లిపిలో ముద్రించారు. అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ గురువారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన అంధులతో ఆయన ఆ పుస్తకాన్ని చదివించుకుని అందులోని విశేషాలను తెలుసుకున్నారు. కేసీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయ జీవితం, ఆయన అలంకరించిన పదవులు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, సీఎంగా ఆయన పాలన, తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు తదితరాంశాలను ఆ పుస్తకంలో పొందుపరిచినట్టు వాసుదేవరెడ్డి ఈ సందర్భంగా కేటీఆర్కు వివరించారు. మంత్రి మాట్లాడుతూ... దేశంలోనే కేసీఆర్ గొప్ప నాయకుడనీ, ఆయన చరిత్రను భావి తరాల వారిని తెలపాల్సిన అవసరముందని చెప్పారు. అంధులకు కూడా ఆయన చరిత్రను తెలిపే విధంగా బ్రెయిలీ లిపిలో పుస్తకాన్ని తీసుకురావటం అభినందనీయమన్నారు. అంధ విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా కేటీఆర్ దృష్టికి తీసుకుపోయారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానంటూ ఆయన వారికి హామీనిచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి, కార్పొ రేషన్ల చైర్మెన్లు బాలమల్లు, వేణుగోపాలచారి, సతీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ప్రభాకర్, పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.