Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీబీసీపై ఐటీ దాడులు దారుణం : హరీశ్ రావు
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
కూలుస్తాం.. పేలుస్తామని చిల్లర మాటలు మాట్లాడితే ప్రతిపక్షాలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు, సచివాలయం నిర్మిస్తుంటే.. వాటిని పేల్చేస్తాం కూల్చేస్తాం అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని విమర్శించారు. పునాదులు వేసేవారి వెంట ఉంటారో.. కూల్చేవారి వెంట ఉంటారో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని సైదాపురం సమీపంలో
నిర్మించనున్న 100 పడకల ఆస్పత్రికి గురువారం మంత్రి తన్నీరు హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూ.35 కోట్లతో ఆస్పత్రిని నిర్మించనున్నారు. అనంతరం యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ సమావేశం డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కోసం బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించామని, ఇప్పటికే 9 నోటిఫికేషన్లు విడుదల చేశామని చెప్పారు. ఇది చూసి ఓర్వలేని బీజేపీ నాయకులు ఉద్యోగాలు ఇవ్వడం కూడా కుట్ర అని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. యాదగిరిగుట్ట ప్రజలకు ఒకరోజు ముందే 100 పడకల ఆస్పత్రి ద్వారా కేసీఆర్ జన్మదిన కానుక అందిందని చెప్పారు. నల్లగొండ జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నా గతంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయలేదని, తాము ఇప్పటికే రెండు మెడికల్ కాలేజీలు స్థాపించామని త్వరలోనే యాదాద్రిలో కూడా ప్రకటిస్తామన్నారు. తెలంగాణలో లక్ష జనాభాకు ప్రస్తుతం 19 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయనీ, దేశంలో ఇలా ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. యాదాద్రిని భూలోక వైకుంఠంగా నిర్మించారని కొనియాడారు. ఆలేరు నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతమని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆలేరుకు సాగునీరు రప్పిస్తామన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు యాదగిరిగుట్టలో ఆస్పత్రిని మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆస్పత్రికి శంకుస్థాపన కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజరు కుమార్, డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఆర్డీఓ భూపాల్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్, జెడ్పీ వైస్ చైర్మెన్ బిక్కు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
దేశం పరువు పోతున్నది
బీబీసీపై ఐటీ రైడ్ చేయడం దారుణమని, ఇది చూసి జనం నవ్వుకుంటున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బీబీసీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ అని, ఆ సంస్థపై దాడి చేసి దేశం పరువు తీసేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీసీలో ఒక వార్త వచ్చిందని తెల్లారి ఐటీ దాడులు చేయించారని, ప్రపంచం ముందు దేశం పరువు పోతున్నదని అన్నారు.. నాయకులకు ఓపిక, సమాధానం చెప్పే శక్తియుక్తులు ఉండాలని, ఇలా దాడులు సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఐటీ, ఈడీలను తోలుతా అంటే దేశం పరువు పోదా? అని ప్రశ్నించారు
యాదాద్రీశున్ని దర్శించుకున్న మంత్రి దంపతులు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని మంత్రి హరీశ్‌రావు దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. గర్భాలయంలో దర్శనానంతరం ఆశీర్వచనం చేసి ప్రసాదాలను అందజేశారు.