Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర
నవతెలంగాణ - హైదరాబాద్
పోడు భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదివాసీలు చేపట్టిన ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణంగా మద్ధతు ఇస్తుందని తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. ఈ విషయంలో అనవసర జాప్యం జరగకుండా ఆదివాసీలకు తక్షణమే న్యాయం చేయాల్సిన భాద్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని వ్యాఖ్యానించారు.
గురువారం ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నాయకులు కాసానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పోడు సాగు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలనీ, అటవీ సంరక్షణ నియమాలు - 2022ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలనే డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 20వ ఆందోళన చేయనున్నట్టు తెలిపారు. దీనికోసం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని కాసానిని ఆహ్వానించారు. ఈ భేటీ సందర్భంగా కమిటీ సభ్యులు పోడు భూములకు సంబంధించి ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. ఇందుకు కాసాని స్పందిస్తూ అనాదిగా అడవులను నమ్ముకుని జీవిస్తున్న అర్హులైన ఆదివాసీలకు పోడు భూములపై హక్కు పత్రాలను తక్షణమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడు భూములకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న దానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నాయని వివరించారు.
ఆడివాసీలకు చట్టంలో పెట్టిన 14 హక్కులు పదహారు సంవత్సరాలుగా తెలంగాణతో సహా దేశంలో ఎక్కడా అమలు కాకపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2006 చట్టం ద్వారా డిసెంబర్ 13, 2005 వరకు పోడు భూములపై ఉన్న ఆదివాసీలకు చట్టబద్ధ హక్కు లభించిందనీ, ఆ మేరకు వెంటనే అర్హులైన ఆదివాసీలకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్లు వేముల వెంకట్రామయ్య, తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి ప్రొ. తిరునగరి జ్యోత్స్న, రాష్ట్ర నాయకులు అట్లూరి సుబ్బారావు, మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, నాయకులు షేక్ ఆరిఫ్, యానాల అనంతరెడ్డి, పోలంపల్లి అశోక్, మెట్టుకాని శ్రీనివాస్, కసిరెడ్డి శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.