Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రవేశపెట్టిన తుషార్‌ఘోష్, బలపరిచిన పళనిస్వామి
జ్యోతిబసు నగర్ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
దేశంలో రోజురోజకూ పెరుగుతున్న మత విద్వేషాలను తిప్పికొట్టాలని వ్యవసాయ కార్మికసంఘం జాతీయ మహాసభ పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రతిపాదించిన తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని సంఘం జాతీయ సహాయ కార్యదర్శి తుషార్‌ఘోష్ ప్రతిపాదించగా తమిళనాడు ప్రతినిధి పళనిస్వామి బలపరిచారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్మికవర్గం ఎక్కడికక్కడ ఐక్యం కావాలని తీర్మానంలో పేర్కొన్నారు బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత లౌకికతత్వంపై దాడి పెరగడం ఆందోళనమని, మోడీ వచ్చిన తరువాత ఇది మరింత పెరిగిందని తెలిపారు. అధికారిక సంస్థలను ఉపయోగించడం ద్వారా దీన్ని ముందుకు తెచ్చారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా లౌకికతత్వం ప్రమాదంలోకి వెళ్లిందని తీర్మానంలో పేర్కొన్నారు.
గత మూడేళ్లలో దేశంలో 50 చోట్ల మతపరమైన ఘర్షణలు జరిగాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోందని వివరించారు. ఆహార అలవాట్లపైనా, మైనార్టీలు, చర్చిలపైనా దాడులు పెరిగాయని వివరించారు. ముస్లిములపై దాడులు చేయడం లవ్‌జిహాద్ పేరుతో హత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే వారి ఆస్తులను బుల్డోజ్ చేస్తున్నారని తీర్మానంలో పొందుపరిచారు. సీఏఏ పేరుతో ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులుగా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. . బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం వ్యతిరేక ప్రచారం తీవ్రస్థాయిలో జరుగుతోందని పేర్కొన్నారు. ఆవులు, ఆహారం పేరుతో పేదలపై నిరంతరం దాడులు చేయడంతోపాటు పెట్టుబడిదారుల దోపిడీకి దీన్ని ఒక ఆయుధంగా వినియోగిస్తున్నారని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా బలమైన లౌకికతత్వంతో కూడిన పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. మతం, కార్పొరేట్ అనుబంధ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలని తీర్మానించారు.