Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి థర్మల్ విద్యుత్కేంద్రంలో తొలి ఎఫ్‌జీడీ ఏర్పాటు
- గడువులోపే పనులు పూర్తిచేయాలి: ఎమ్డీ ఎన్. శ్రీధర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సంపూర్ణ కాలుష్య రహిత కేంద్రంగా తీర్చిదిద్దడానికి వీలుగా రూ.696 కోట్ల వ్యయంతో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) అనుబంధ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు సింగరేణి సంస్థ చైర్మెన్, ఎమ్డీ ఎన్.శ్రీధర్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో డైరెక్టర్ (ఈఅండ్ఎం) డి.సత్యనారాయణ రావు, థర్మల్ ప్లాంట్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీలతో ఎమ్డీ సుదీర్ఘంగా సమీక్షించారు. పనులు గడువు కన్నా ముందే పూర్తిచేయాలని నిర్మాణ సంస్థ అయిన పీఈఎస్ ఇంజినీర్స్ ప్రయివేటు లిమిటెడ్స్ను ఆదేశించారు. యూనిట్ ఒకటికి సంబంధించిన ఎఫ్జీడీని 2024 జూన్ కల్లా, రెండో యూనిట్‌ను అదే ఏడాది సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని ఆయన కాలపరిమితిని నిర్దేశించారు. ఈ సమీక్ష జీఎం (కోఆర్డినేషన్) ఎం. సురేష్, చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ సంజరు కుమార్ సూర్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జనరల్ మేనేజర్ డి.ఎస్. సూర్యనారాయణ రాజు, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్.వి.కె. విశ్వనాథరాజు, సివిల్ ఏజీఎం ప్రసాద్, ఎఫ్‌జీడీ ప్రాజెక్ట్ ఇన్చార్జి శ్రీనివాసులు, కన్సల్టెంట్ (ఎన్.టి.పి.సి) సోహైల్ ఖాన్, నిర్మాణ ఏజెన్సీ (పి.ఈ.ఎస్) ఎమ్డీ వాసుదేవ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎఫ్జీడీతో వాయు శుద్ధి ప్రక్రియ ఇలా...
ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్గా పిలవబడే ఈ ప్రాజెక్టులో భాగంగా బొగ్గును మండించగా వచ్చే వాయువులో దాగి ఉన్న సల్ఫర్ అనుబంధ వాయువులను వేరుచేస్తారు. దానికోసం 150 మీటర్ల ఎత్తయిన ఒక చిమ్నీనీ ఏర్పాటు చేస్తారు. ఈ చిమ్నీలో కింది నుంచి పైకి వెళ్లే వాయువుపై కాల్షియం కార్బోనేట్ (తడి సున్నం)ను పైనుంచి బలంగా పంపిస్తారు. తద్వారా బొగ్గు మండించిన వాయువుల్లో ఉన్న సల్ఫర్ డయాక్సైడ్తో పలుదశల్లో తడి సున్నంతో రసాయనిక చర్య జరుగుతుంది ఈ ప్రక్రియలో వాయువులో ఉన్న సల్ఫర్ అనుబంధ వాయువులన్నింటినీ తడి సున్నం పీల్చుకుంటుంది.
తత్ఫలితంగా బయటకు విడుదల చేస్తున్న వాయువులలో సల్ఫర్ అనుబంధ వాయువుల శాతం ఘనపు మీటరుకు 200 మిల్లీ గ్రాములలోపే ఉంటుంది. ఈ రసాయనిక ప్రక్రియలో అంతిమంగా కాల్షియం సల్ఫేట్ అనే ఘన పదార్థం ఏర్పడుతుంది. దీనినే జిప్సం అంటారు. ఈ ప్రక్రియలో వెలువడే జిప్సాన్ని ఎరువులు, సిమెంటు, పేపర్, వస్త్ర పరిశ్రమ, నిర్మాణరంగంలో వినియోగిస్తున్నారు.