Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పిలుపు
- రెడ్ బుక్స్ డే సందర్భంగా నెల రోజులపాటు అధ్యయనం
- 'భారత విప్లవ కెరటం భగత్‌సింగ్' పుస్తకావిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెడ్ బుక్స్ డే సందర్భంగా రాష్ట్రంలో ఈనెల 21 నుంచి మార్చి 23 (భగత్‌సింగ్ వర్థంతి) వరకూ అధ్యయన మాసోత్సవాన్ని నిర్వహించనున్నట్టు సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ నెల రోజులపాటు భగత్‌సింగ్ జీవిత చరిత్రను అధ్యయనం చేయాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో 'భారత విప్లవ కెరటం భగత్‌సింగ్' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, చుక్క రాములు, టి.సాగర్, నవతెలంగాణ సంపాదకులు ఆర్.సుధాభాస్కర్, సీజీఎం పి. ప్రభాకర్, బుకహేౌస్ ఎడిటర్ కె.ఆనందాచారి, మేనేజర్ కృష్ణారెడ్డి, ఎడిటోరియల్ బోర్డు సభ్యులు ఎ.మోహన్‌కృష్ణ, నియోకర్సర్ ఇన్చార్జి జగదీశ్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ...భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన భగత్‌సింగ్ జైలులో రాసిన వీలునామా, ఆయన సమకాలీకుడు శివవర్మ రాసిన పుస్తకాలను కలిపి ముద్రించిన పుస్తకంలోని అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశ యువతకు భగత్‌సింగ్ రోల్ మోడల్ అని అన్నారు. ఆయన ఆశయాలు, లక్ష్యాల గురించి చాలా మందికి తెలియదనీ, వాటిని నేటి యువతకు తెలియజేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆనాటి స్వాతంత్య్ర పోరాటంలో విప్లవయోధుల పాత్ర కీలకమన్నారు. వారి త్యాగాలు మరువలేనివని శ్లాఘించారు. మానవాళి విముక్తి కోసం కృషి చేస్తున్నది కమ్యూనిస్టులేనని ఈ సందర్భంగా తమ్మినేని పునరుద్ఘాటించారు.