Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల్ని వేధిస్తున్న ఇటుకబట్టీల యజమానులు
- చాలీచాలని కూలితో వెట్టి
- లేబర్‌యాక్ట్, వాల్టా చట్టాలకు తూట్లు
- దర్గాతండాలో ఏడుగురు బాలికలపై లైంగిక వేధింపులు
- నిందితుల అరెస్ట్
ఇటుక బట్టీల్లో వలస కార్మికుల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. చాలీచాలని కూలి ఇస్తూ వెట్టి చేయించుకుంటున్నారు. బట్టీల యజమానులు దుర్మార్గంగా వ్యవహరిస్తూ బాలికలు, మహిళలను లైంగికంగా వేధిస్తు న్నారు. దుమ్ముధూళిలో వలస కార్మికులతో రాత్రింబవళ్లూ వెట్టి చేయించు కుంటూ బానిసల కన్నా హీనంగా చూస్తున్నారు. అనుమతుల్లేకున్నా బట్టీలు పెట్టడమే కాకుండా మట్టి, కలప, బొగ్గు, యాస్‌ను తరలిస్తున్నారు. బాల కార్మికులతో పనులు చేయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్, మైనింగ్, లేబర్ కమిషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇందుకు దర్గాతండాలో ఏడుగురు వలస కార్మిక బాలికలపై లైంగిక వేధింపుల ఘటనే ఉదాహరణ. ఆ కార్మికులు వారి రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేయడం.. వారు ఇక్కడికి మెయిల్ పంపడంతో రాష్ట్ర అధికారులు స్పందించారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
పట్టణీకరణ, గృహనిర్మాణ రంగం పెరుగుదలతో ఇటుకకు డిమాండ్ పెరిగింది. కోట్ల రూపాయల లాభాలు గడించే అవకాశ ముండటంతో ఇటుకబట్టీలు విస్తరిస్తున్నాయి. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, మెదక్, ఆందోల్, నర్సాపూర్, హుస్నాబాద్, సిద్దిపేట, గజ్వేల్, బెజ్జంకి, వట్పల్లి, మునిపల్లి, కల్హేర్ వంటి ప్రాంతాల్లో 500 వరకు ఇటుక బట్టీలు నడుస్తున్నాయి. ఇటుక తయారీ, బట్టీ కాల్చడం, ఎగుమతి పనులన్నీ వలస కార్మికులే చేస్తారు. స్థానికంగా లేబర్ డిమాండ్ ఉందనే నెపంతో ఇతర రాష్ట్రాల నుంచి ఏజెంట్ల ద్వారా చౌకగా లేబర్‌ను తీసుకొస్తున్నారు. వీరికి కనీస వేతనాలు, సదుపాయాలేవీ కల్పంచట్లేదు.
వలస కార్మికులతో వెట్టి చాకిరీ
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడి నుంచో కార్మికులు వలసలొచ్చి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో బట్టీల్లో పనిచేస్తున్నారు. అడవులు, పొలాలు, గుట్టల ప్రాంతాల్లోని బట్టీల వద్ద చిన్న చిన్న పాకల్లో ఉంటూ రాత్రింబవళ్లూ పనిచేస్తారు. ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్ ప్రాంతాల కూలీలు ఇక్కడి బట్టీల్లో పనిచేస్తున్నారు. కుటుంబంతో సహా వచ్చే కార్మికులకు ఒక రేటు ఇస్తామని యజమానులు ఒప్పందం చేసు కుంటారు. అడ్వాన్స్‌గా కొంత ఏజెంట్‌కు చెల్లించి ఇటుక తయారీ నుంచి బట్టీ కాల్చే వరకు కార్మికులతో పనిచేయించుకుంటారు. అడ్వాన్స్ సొమ్ము ఇచ్చిన యజమానులు నెలల తరబడిగా కూలీలకు డబ్బులివ్వడం లేదు. డబ్బులిస్తే కూలీలు వెళ్లిపోతారనే నెపంతో కనీస అవసరాలైన బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలకు కూడా డబ్బులివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఒక్కసారి ఇక్కడ పనికి కుదిరితే తిరిగి బయటపడటం కష్టమని కూలీలు చెబుతున్నారు. అలా ప్రయత్నిస్తే దాడి చేయడం, వేధింపులకు గురి చేయడం పరిపాటిగా మారిందంటున్నారు. రాత్రుళ్లు చీకట్లోనే మగ్గుతారు. నీటి వసతి ఉండదు. అనారోగ్యం పాలైతే మందుగోలికి కూడా డబ్బులివ్వరని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్గాతండా బట్టీలో 72 మంది ఒడిషా కార్మికులు పనిచేశారు. వీరికి రూ.10 లక్షల అడ్వాన్స్‌గా ఇచ్చి తీసుకొచ్చారు. ఏజెంట్‌కు డబ్బులిచ్చిన యజమాని మూడు నెలలుగా పనిచేస్తున్న కార్మికులకు పైసా ఇవ్వకుండా వేధించాడు. పిల్లలపైనా లైంగిక వేధింపులకు పాల్పడటంతో కార్మికులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
అనుమతులుండవు.. చట్టాలేవీ పట్టవు
ఇటుకబట్టీలు పెట్టాలంటే గ్రామ పంచాయతీ అనుమతి పొందాలి. లేబర్ పనిచేస్తున్నట్టు కార్మిక శాఖలో నమోదు చేయాలి. మట్టి తరలింపుకు రెవెన్యూ, భూగర్భ జల శాఖ అనుమతి పొందాలి. చెట్లు నరకడం, రవాణా చేయడానికి అటవీ, చెక్‌పోస్ట్ అనుమ తులుండాలి. భారీ లైట్లు, మోటర్లు నడిపేం దుకు విద్యుత్ కనెక్షన్‌కు అనుమతుండాలి. పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఇటుక రవాణాకు రవాణా శాఖ అనుమతి పొందాలి. బాల కార్మికులు పనిచేయకూడదు. బట్టీ కాల్చ డం, కూలీల నివాసం వద్ద అగ్ని ప్రమాదాలు జరిగితే రక్షించుకునే ఏర్పాట్లున్నా యని ఫైర్ సర్టిఫికెట్ ఉండాలి. నీటిని వినియోగించేం దుకు, చెర్వు మట్టి తవ్వేందుకు ఇరిగేషన్ పర్మీషన్ తీసుకోవాలి. కానీ..! ఉమ్మడి మెదక్ జిల్లాలో బట్టీల్లో ఇవేవీ పట్టకుండా ఇష్టా రాజ్యంగా నడుపుతున్నారు. ఇటుక బట్టీలు నడిపే యజమానులు స్థానిక ఎమ్మెల్యేలు, రాజ కీయ నాయకుల అండ ఉంటే చాలు అనే ధోరణిలో ఉన్నారు.
మట్టిలో మగ్గుతున్న బాల కార్మికులు
విద్యా హక్కు చట్టం ప్రకారం 6-14 సంవత్సరాల పిల్లలంతా బడిలో ఉండాలి. కానీ..! ఇటుక బట్టీల వద్ద వలస కార్మికుల పిల్లలు పనిలో ఉంటున్నారు. వారితో ట్రాక్టర్ నడపడం, నీళ్లు పట్టడం, పొట్టు, యాస్, ఇటుకలు మోసే పనులు చేయిస్తున్నారు. చైల్డ్ ప్రొటక్షన్ అధికారులు, విద్యా శాఖ తనిఖీలు చేయట్లేదు. ఇటీవల వట్పల్లి, నారాయణఖేడ్, సంగారెడ్డిలో బాల కార్మికులు పనిచేసే చోట తనిఖీలు చేసిన అధికారులు యజమానులు ఇచ్చిన ముడుపులు తీసుకుని వదిలేశారన్న ఆరోపణలున్నాయి. నిజాంపేట మండలంలోని దర్గాతండాలోని ఎస్ఆర్బీ బ్రిక్స్ యజమాని అక్కడ పనిచేసే ఒడిషాకు చెందిన ఏడుగురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసు నమోదైంది. కార్మికుల ఫిర్యాదుతో బట్టీ యజమానులైన శంకర్, గంగాధర్, రమేష్, పరమేష్‌పై 354, 354ఎ ఐపీసీ పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇతర పరీక్షల నిమిత్తం బాలికల్ని సఖీ సెంటర్లో ఉంచారు. ఇలాంటివి వెలుగు చూడని సంఘటనలెన్నో.
నిరంతరం తనిఖీ చేయాలి
ఇటుక బట్టీలను నిరం తరం అధికారులు తనిఖీ చేయాలి. కార్మికులకు కనీస వేతనాలివ్వ కపోతే యజమా నులపై చర్యలు తీసుకోవాలి. దర్గాతండా వలస కార్మికుల పిల్లల్ని లైంగికం గా వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలి. యజమానులిచ్చే డబ్బులు తీసుకుని అధికారు లు తనిఖీలు చేయట్లేదు. వలస కార్మికులకు రక్షణ, భదత్ర కల్పించాలి. లేబర్, రెవెన్యూ, అటవీ, మైనింగ్, పొల్యూషన్, పంచాయతీ అధికారుల నిర్లక్షం వల్లనే బట్టీ యజమానులు మాఫియాలా వ్యవహరిస్తున్నారు.
- అతిమెల మాణిక్యం- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
అనుమతుల్లేకపోతే చర్యలు
ఇటుక బట్టీలు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవాలి. అనుమతుల్లేకుండా నడిపితే చర్యలు తీసుకుంటాం. దర్గాతండా ఎస్ఆర్బీ బ్రిక్స్‌ను అనుమతులున్నాయి. లేబర్‌ను ఇబ్బందులు పెట్టినందుకు చర్యలు తీసుకుంటాం.
- సురేష్‌మోహన్
సంగారెడ్డి డీపీఓ