Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 46 రోజుల్లో 1.9కోట్ల మంది జర్నీ
- నాంపల్లి స్టేషన్‌కు 11లక్షల మంది రాకపోకలు
- ప్రయాణికులతోపాటు సందర్శకులకు మెట్రో అదనపు సౌకర్యాలు
- మంత్రి చేతుల మీదుగా ప్రత్యేక జ్ఞాపిక అందుకున్న హెచ్ఎంఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆల్ ఇండియా ఇండిస్టియల్ ఎగ్జిబిషన్(నుమాయిష్) హైదరాబాద్ మెట్రో రైల్‌కు జోష్ నింపింది. నగరంలో 46 రోజులపాటు జరిగిన నుమాయిష్‌కు ప్రజలు పోటెత్తిన ఫలితంగా మెట్రోకూ ప్రయాణికుల తాకిడి పెరిగింది. మెట్రోకు చెందిన రెండు కారిడార్లు.. మియాపూర్-ఎల్బీనగర్, రారుదుర్గ్-నాగోల్ రూట్లో జనవరి 1వ తేదీ నుంచి ఈ నెల 15వ తేదీ వరకు సుమారు 1.9 కోట్ల మంది ప్రయాణించారు. ఇందులో ఒక్క నాంపల్లి స్టేషన్‌కే దాదాపు 11 లక్షల మంది రాకపోకలు సాగించినట్టు మెట్రో వర్గాలు వెల్లడించాయి. అంతేగాక నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులతో పాటు ప్రయాణికులకు మెట్రో అదనపు సౌకర్యాలు కల్పించింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి ఒకటో తేదీన 82వ నుమాయిష్ ఎగ్జిబిషన్ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. విభిన్న సంస్కృతులు, ఆహార అలవాట్లు, వివిధ రాష్ట్రాల ఉత్పత్తులకు వేదికగా నుమాయిష్ నిలిచింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సంస్థ ట్రైన్ల సర్వీసుల్లో మార్పులు చేసింది. నుమాయిష్ జరిగినన్ని రోజులు మెట్రో రైలు సేవలను రాత్రి సమయంలో గంట పొడిగించింది. అంటే అర్ధరాత్రి 12గంటల వరకు మెట్రో రైళ్లను నడిపారు. సాధారణ రోజుల్లో టర్మినల్ స్టేషన్లు అయిన ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం నుంచి రాత్రి 11గంటలకే చివరి మెట్రో రైలు అందుబాటులో ఉంటుంది. నుమాయిష్ నేపథ్యంలో చివరి సర్వీసు అర్ధరాత్రి 12గంటలకు బయలుదేరుతుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, ఈ పొడిగింపు మియాపూర్-ఎల్బీనగర్(రెడ్ లైన్), నాగోల్ నుంచి రాయదుర్గం(బ్లూ లైన్) కారిడార్‌కు మాత్రమే అధికారులు పరిమితం చేశారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే ప్రయాణికుల రద్దీ కారణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడంతోపాటు ఎగ్జిబిషన్ నడిచినంత కాలం గాంధీభవన్ మెట్రో స్టేషన్లో ఉండే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 4 టిక్కెట్ కౌంటర్ల స్థానంలో 6కు పెంచారు. సందర్శకుల కోసం అదనపు సౌకర్యాలు కల్పించారు. మొత్తానికి ఎగ్జిబిషన్ సాగిన ఈ 46 రోజుల్లో దాదాపు 1.9కోట్ల మంది ప్రయాణికులను మెట్రో రైల్లో వారివారి గమ్యస్థానాలకు చేర్చి రికార్డు సృష్టించింది.
హెచ్ఎంఆర్కు నుమాయిష్ సత్కారం
గ్రేటర్‌వాసులు నాంపల్లి ఎగ్జిబిషన్‌కు సులువుగా చేరుకునేందుకు మెట్రో రైలు అధికారులు కృషి చేశారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు అదనపు సౌకర్యాలు కల్పించిన హెచ్‌ఎంఆర్‌ను ఏఐఐఈ(నుమాయిష్) సొసైటీ-2023 ఘనంగా సత్కారించింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ చేతులమీదుగా ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని హెచ్ఎంఆర్ తరపున కియోలిస్ హైదరాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్-స్టేషన్స్ జైపాల్ రెడ్డి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్, ఏఐఐఈ-నుమాయిష్ చెందిన కీలక ప్రతినిధులు పాల్గొన్నారు.