Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కడికెళ్లాలో తోచని స్థితిలో విద్యార్థునులు
- ప్రభుత్వ దంత వైద్యకళాశాలలో దుస్థితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీడీఎస్ పూర్తి చేసి ఇంటర్న్‌షిప్ కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వ దంత కళాశాల విద్యార్థినులు వసతి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వారుంటున్న హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లాలని ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ ఆదేశాలు జారీ చేయడంతో ఉన్నఫళంగా ఎక్కడికెళ్లాలో దిక్కుతోచని స్థితిలో వారు బిక్కుబిక్కుమంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటర్న్ షిప్ కోసమున్న విద్యార్థినీలకు వసతి లేదని చెప్పడం, ఉన్న వసతిలోనే సర్దుకుంటూ ఉంటామని విద్యార్థులంతా చెబుతున్నా ...కుదరదని తేల్చి చెబుతుండటంతో గత 15 రోజులుగా హైదరాబాద్ లోని డెంటల్ కళాశాల విద్యార్థినీలు ఆందోళనకు గురవుతున్నారు. 2018లో బీడీఎస్ లో చేరిన 77 మందిలో 42 మంది విద్యార్థినీలున్నారు. ఆయా విద్యార్థినులకు ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలోనే వసతిని కల్పించారు. ఈ హాస్టల్ లోనే బీడీఎస్ మొదటి, రెండో, మూడో సంవత్సరం చదివే విద్యార్థులతో పాటు ఇంటర్న్ షిప్ కోసం ఎదురు చూస్తున్న వారు, నెల రోజుల్లో ఇంటర్న్ షిప్ అయిపోయి వెళ్లిపోయే విద్యార్థినీలు కూడా ఉన్నారు. గతేడాది కూడా ఇలాంటి వసతి సమస్యే తలెత్తితే అప్పటికే విద్యార్థినీలు చెల్లిస్తున్న రూ.800 హాస్టల్ ఫీజును రూ.1,200కు పెంచి సర్దుబాటు చేశారు. మరో వైపు ప్రస్తుతం ఇంటర్న్ షిప్ పూర్తి కావస్తున్న విద్యార్థినీలు 40 మంది వరకు నెల రోజుల్లో హాస్టల్ ఖాళీ చేసి వెళ్లనున్నారు. తాజాగా ఇంటర్న్ షిప్ కోసం ఎదురు చూస్తున్న వారు కనీసం హాస్టల్ ఫీజు పెంచైనా సరే.... తమను అక్కడే కొనసాగనివ్వాలని ప్రిన్సిపాల్ ను వేడుకున్నారు. అయినప్పటికీ కచ్చితంగా ఖాళీ చేయాల్సిందే అన్నట్టు ఆదేశిస్తుండటంతో ఏడాది పాటు బయట హాస్టళ్లో ఉండటమనేది ఖర్చుల రీత్యా, రవాణాపరంగా తమకు ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థినీలు వాపోతున్నారు. పైపెచ్చు బయటి హాస్టళ్లలో తమకున్న పుస్తకాలు పెట్టుకునేందుకు సరిపడా వసతి కూడా ఉండదని చెబుతున్నారు. దీనికి తోడు పేద కుటుంబాల నుంచి వచ్చిన చాలా మంది విద్యార్థినీలకు బయట హాస్టళ్లో ఉండటం మరింత కష్టమని చెబుతున్నారు. సంబంధిత అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
కొనసాగించాలి...
2018 బ్యాచ్ విద్యార్థినీలను యధావిధిగా హాస్టల్లో ఉండేందుకు అనుమతించాలని ఆల్ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మహ్మద్ మంజూర్ డిమాండ్ చేశారు. బయట ఉంటే భద్రతా పరంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని విద్యార్థినీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఇంటర్నీలు ఖాళీ చేసేంత వరకు మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం డార్మిటరీని ఉపయోగించు కుంటూ, మూడో సంవత్సరం పూర్తయిన వారికి యధావిధిగా హాస్టల్లో కొనసాగించాలని కోరారు.