Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఆర్ఎంబీని కోరిన ఈఎన్సీ
- మార్చి మొదటివారంలో మళ్లీ భేటి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆంద్రప్రదేశ్ ఇప్పటికే ఈ సంవత్సరం కృష్ణా నీటిని వాటాకు మించి వాడుకున్నదనీ, ఆ లెక్కలను తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీని కోరింది. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన సమావే శంలో తెలంగాణ సాగునీటి, ఆయకట్టు అభివృధ్ధి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి. మురళీధర్ మాట్లాడారు. ఈసందర్భంగా కృష్ణా నదీ నీటి లెక్కలకు సంబంధించి వివరంగా త్రిసభ్య కమిటికి వివరించారు. నీటి లెక్కలను తేల్చడం ద్వారా ఏ రాష్ట్రం ఎంత వాడుకున్నదీ, ఎవరి వాటా ఎంత మిగిలి ఉందో స్పష్టమవు తుందని చెప్పారు. కాగా ఈ సమావేశానికి ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి హాజరు కాలేదు. ఆ మేరకు ముందస్తు సమాచారం కేఆర్ఎంబీ అధికారులకు ఇచ్చారు. పోలవరం పర్యటన ఉన్న కారణంగా హాజరు కావడం లేదని బోర్డు సభ్యకార్యదర్శికి తెలిపారు.
దీంతో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రారుపురే, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సమావేశమయ్యారు. ఈ ఏడాది ఏపీ ఇప్పటికే వాటాకు మించి కృష్ణా నీటిని వాడుకుందనీ, నీటిలెక్కల విషయంలో కఠినంగా ఉండాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. తమకు 141 టీఎంసీలకు అవకాశం ఉందనీ, ఆమేరకు నీటిని వాడుకుంటామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, సభ్యకార్యదర్శి రారుపురేకు తెలియజేశారు. వచ్చే నెలా మొదటివారంలో త్రిసభ్య కమిటీ మరోమారు సమావేశమయ్యే అవ కాశం ఉందన్నారు. అటు పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరింది. కొత్త చైర్మెన్ వచ్చిన నేపథ్యంలో బోర్డు సమావేశం పెట్టాలన్న ఈఎన్సీ మురళీధర్, పూర్తిస్థాయి బోర్డు సమావేశంలో అన్ని అంశాలపై చర్చించడానికి వీలుంటుందని అభిప్రాయపడ్డారు.
గతం..
కృష్ణా ప్రాజెక్టు కింద అవసరాలకు అనుగుణంగా నీటిని పంపిణీ చేసేందుకు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఏపీ ఈఎన్సీ రాకపోవడంతో ఈ విషయమై పూర్తిస్థాయిలో చర్చించే అవకాశం లేకుండాపోయింది. డిసెంబరులో జరగాల్సిన ఈ సమావేశం పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ప్రాజెక్టు నుంచి ఆయా రాష్ట్రాలకు ఏ మేరకు నీరు అవసరం ఉంటుందనే అంశాన్ని ఈ సమావేశంలో చర్చించి ఖరారు చేయాల్సి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో గురువారం నాటికి 34 టీఎంసీలు అందుబాటులో ఉండగా, నీటిని తోడుకునే కనీసం మట్టం స్థాయి వరకు(ఎండీడీఎల్) 18 టీఎంసీల జలాలు నీల్వ ఉన్నట్టు అంచనా వేశారు. నాగార్జునసాగర్‌లో 90 టీఎంసీల లభ్యత ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ నీటి సంవత్సరమైన మే 31 నాటికి రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్రాల వాటా మేరకు వినియోగం పోను మిగిలిన నీటిని పంపిణీ చేయాల్సి ఉంది. ఆమేరకు వచ్చే బోర్డు త్రిసభ్య కమిటీ భేటిలో మరోమారు చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.