Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో పారిశుధ్యం, ఇతర పనుల కోసం సర్వీసు పర్సన్లను నియమించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పారిశుధ్యం, ఇతర సర్వీసు పనులను గ్రామ పంచా యతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు నిర్వహించా లంటూ 2020, సెప్టెంబర్‌లో ఆదేశించారని గుర్తు చేశారు. ఈ నిర్ణయం చేసినప్పుడే ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్యం, ఇతర సర్వీసు పనులు అవి చేయలేవని చెప్పామని తెలిపారు. కానీ నేటి వరకు అదే విధానం కొనసాగిస్తున్నారని పేర్కొ న్నారు. మరుగుదొడ్లను రోజుకు మూడుసార్లు శుభ్రం చేయాలని తెలిపారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత, కారిడార్, గదులను ఊడ్చాలని వివరిం చారు. ఉదయం తాళాలు తీయాలనీ, సాయంత్రం వేయాలని పేర్కొన్నారు. కుర్చీలు, బల్లలు, బెంచీలపై దుమ్ము దులపాలని సూచించారు. పీరియెడ్ వారీగా బెల్ కొట్టాలని తెలిపారు. తరగతి గదుల్లోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయు లకు నోటీసులు అందించాలని పేర్కొన్నారు. ఈ పనులు చేసేందుకు పాఠశాల/కళాశాల ప్రారంభం నుంచి ముగించే వరకు వ్యక్తి ఉండాలని సూచిం చారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట ఒకరికంటే ఎక్కువ మందిని నియమించాలని కోరారు. అయితే పూర్తిస్థాయిలో అలాంటి వ్యక్తులను నియమించేందుకు ఆర్థిక స్థోమత లేదంటూ గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు చెప్తున్నాయని వివరించారు. మన ఊరు-మనబడి పథకంలో బడులను బాగు చేస్తున్నారని తెలిపారు. నీటి సరఫరాతో కూడిన మరుగుదొడ్లను నిర్మిస్తు న్నారని పేర్కొన్నారు. కానీ పారిశుధ్యం కోసం వ్యక్తిని ప్రత్యేకంగా ఇవ్వకుండా స్థానిక సంస్థలకు వదిలేస్తే మళ్లీ ఎప్పటిలాగే ఉంటుందని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారని వివరించారు. ఈ అంశాలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలుసనీ, సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని తెలిపారు. 2020కి ముందు విద్యాశాఖ ద్వారానే పారిశుధ్య కార్మికులను నియమించే విధానం ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వారిని నియమించాలని కోరారు. ఇలాంటి నియామకాలు స్థానిక సంస్థల ద్వారా చేసినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. పది శాతం గ్రామపంచాయతీలు మాత్రం వాటి నిధుల నుంచి ప్రత్యేక ఒక వ్యక్తిని పాఠశాలకు నియమించారని తెలిపారు. మిగిలిన స్థానిక సంస్థలు మాత్రం ప్రత్యేకంగా నియమించేందుకు నిధుల్లేవంటూ ప్రకటిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరారు.