Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్తంభంపై నుంచి జారి పడ్డారంటున్న అధికారులు
- కరెంట్ షాక్‌తోనే మృతిచెందాడని కుటుంబీకుల ఆరోపణ
నవతెలంగాణ - సిరిసిల్ల క్రైం
విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఓ కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తీగలపల్లి గ్రామానికి చెందిన వనమాల నాగరాజు(22) సిరిసిల్ల పట్టణం సెస్ పరిధిలో జరుగుతున్న విద్యుత్ మరమ్మతు పనుల్లో తాత్కాలిక కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేపడుతున్న సమయంలో ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే గమనించిన తోటి కార్మికులు సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నాగరాజు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరగా.. మరమ్మతులు చేసే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు తెలిపారు. మృతుడి శరీరంపై షాక్ తగిలిన గాయాలు ఏమీ లేకపోవడంతో ప్రమాదవశాత్తు జారిపడి మరణించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కానీ మృతుడి కుటుంబీకులు మాత్రం నాగరాజు కరెంట్షాక్తోనే చనిపోయాడని ఆరోపిస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తోటి కార్మికులు కోరుతున్నారు.