Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ టౌన్
చోరీ కేసులో అరెస్టు చేసి నిందితుడైన తన భర్తను తీవ్రంగా కొట్టి.. తన మరణానికి కారణమైన మెదక్ పట్టణ ఎస్ఐ, కానిస్టేబుళ్లపై హత్య కేసు నమోదు చేయాలని మృతుని భార్య సిద్దేశ్వరి శుక్రవారం మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. చోరీ కేసులో ఖాదర్ ఖాన్ను గత నెల 29వ తేదీన అరెస్టు చేసి, అదే రోజు రాత్రి ఇంట్లో విడిచిపెట్టినట్టు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఖాదర్ఖాన్ను మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, గురువారం రాత్రి అతని పరిస్థితి విషమించి మృతి చెందినట్టు తెలిపారు. తన భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అవయవాలు అన్ని దెబ్బతినేలా చేసి ఆయన మరణానికి కారణమైన ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ ఆర్ ప్రవీణ్ కుమార్, బొరకల ప్రశాంతపై హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు సిద్దేశ్వరి మెదక్ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.