Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కేంద్రాల్లో జెండావిష్కరణలతో ప్రారంభం
- 28న రాష్ట్ర సదస్సు
- చట్టాలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఉద్యమం : ఎన్పీఆర్డీ ప్రధాన కార్యదర్శి అడివయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ నెల 21నుంచి ఎన్పీఆర్డీ అవిర్భావ వారోత్సవాలను నిర్వహించనున్నట్టు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు జెర్కొని రాజుతో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21న జిల్లా కేంద్రాల్లో జెండాల అవిష్కరణ, 28న హైదరాబాద్లో విద్యా, ఉపాధి, అంశాలపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. వికలాంగుల చట్టాలు సంక్షేమ పథకాల అమలు కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. 2010 ఫిబ్రవరి 20-21తేదీల్లో ఆత్మగౌరవం, హక్కుల సాధన లక్ష్యాలతో సంఘం ఏర్పడిందని గుర్తుచేశారు.అవిర్భావ దినోత్సవాల సందర్భంగా సెమినార్లు, రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపారు. 13 ఏండ్లలో వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు చేసి విజయాలు సాధించామన్నారు. 2016 ఆర్పీడీ చట్టం, యూనివర్సల్ గుర్తింపు కార్డులు, ఉపాధి హామీ చట్టంకింద 150 రోజుల పని, అంత్యోదయ రేషన్ కార్డులు మంజూరు తదితర అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించామని చెప్పారు. 2016 ఆర్పీడీ చట్టంలో సవరణలు చేయాలనీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు అవకాశాలు లేకుండా చేయాలని చూస్తే పోరాటాల ద్వారా వాటిని తిప్పి కొట్టామని గుర్తుచేశారు. రాష్ట్రంలో పెన్షన్ పెంపు కోసం పోరాడి సాధించుకున్నామన్నారు. వివాహ ప్రోత్సాహం పెంపు, మరగుజ్జులకు బస్ పాసులు, రుణాల సబ్సిడీ పెంపుకోసం ఉద్యమాలు చేసి విజయాలు సాధించామన్నారు. రాబోయే కాలంలో పింఖఛన్ను రూ.10 వేలకు పెంపు, ఉచిత విద్యుత్, ప్రయాణ సౌకర్యం, బ్యాక్ లాక్ పోస్టుల భర్తీ, నామినేటెడ్ పదవుల్లో రిజ్వేషన్ల అమలు, స్వయం ఉపాధి, రుణాల కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలిపారు.