Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల పొత్తులపై బీఆర్ఎస్తో చర్చించలేదు
- రాబోయే ఎన్నికల్లో సీపీఎంతో కలిసి పోటీ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలో, ఎవరు రాకూడదో నిర్ణయించే శక్తి సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలకుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. బీజేపీని నిలువరించడమే మా లైన్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ మగ్దూంభవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో కూనంనేని వివరాలను వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో సీపీఐ(ఎం)తో కలిసే పోటీ చేస్తామన్నారు. ఖమ్మంలో సీపీఐ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తామనీ, ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇరు పార్టీలు ఐక్యంగా బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తాయని తెలిపారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా సరే....ఈ సారి ఎన్నికల్లో కలిసే ఉండాలని రెండు పార్టీలు నిర్ణయించాయని తెలిపారు. తమ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఇతరులతో కలుస్తామని తెలిపారు.
అనామకుల కామెంట్లకు స్పందించం....
ఎవరో అనామకులు, రోజుకో పార్టీ, రంగు మార్చే వారు కమ్యూనిస్టులకు రెండు, మూడు సీట్లు బీఆర్ఎస్ ఇస్తుందనీ, అసలు ఎమ్మెల్యే సీట్లే ఇవ్వడం లేదంటూ చేసే ప్రచారానికి తాము స్పందించబోమని తెలిపారు. కమ్యూనిస్టుల విశిష్టతను దెబ్బతీసే ఊహాగానాల వార్తలు సరిగాదన్నారు. ఏదైనా చేస్తే తామే మీడియాకు చెబుతామన్నారు. పోడు భూముల విషయంలో నాలుగు జెండాలేసుకుని వస్తారంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆ నాలుగు జెండాలే పోడు భూముల సమస్యను పరిష్కరించే అనివార్యతను తీసుకొచ్చాయని గుర్తుచేశారు. కమ్యూనిస్టు పార్టీ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉందని తెలిపారు. సింగరేణి ప్రాంతంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిగా, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో సగం, హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లోనూ పార్టీ ప్రభావం ఉందని స్పష్టం చేశారు. 119 నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలను వేయనున్నట్టు ప్రకటించారు. తమ అవసరం ఉందనుకుంటే బీఆర్ఎస్ కలిసి వస్తుందనీ, లేదంటే ఎవరి దారి వారిదేనని స్పష్టం చేశారు. పార్టీని ఎలా నడిపించాలో, ఎలా ముందుకు తీసుకెళ్లాలో తమకు తెలుసన్నారు.
ఆదానీ కుంభకోణంతో దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతున్నా ప్రధాని మోడీ కనీసం విచారణకు ఆదేశించలేదని విమర్శించారు. పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. అయితే అటవీ చట్ట ప్రకారం ఆ ప్రాంతంలో 75 ఏండ్లు పైగా నివాసమున్న గిరిజనేతరులకు కూడా పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచే ఆలోచన మానుకోవాలనీ, అనివార్యమైతే అలాంటి నిర్ణయం తీసుకునే ముందు సామాన్యులకు భారం కాకుండా వినియోగదారులతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
రబీ పంటల ప్రాంతాల్లో 24 గంటలు విద్యుత్ రాక ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఆర్టీసీలో యూనియన్లకు అనుమతించాలని డిమాండ్ చేశారు. పోలీసు నియామకాల్లో దేహధారుఢ్య పరీక్షల నిబంధనలను సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, పశ్యపద్మ, కలవేన శంకర్, తక్కెలపల్లి శ్రీనివాస్, ఎన్.బాలమల్లేష్, బాగం హేమంతరావు, ఎం.బాలనర్సింహ, ఈటి.నరసింహ పాల్గొన్నారు.