Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజేబీవీలకు కాస్మోటిక్ బిల్లులకు మంగళం
- కోవిడ్ నుంచి హెల్త్ కిట్లకు రాంరాం
- ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
కస్తుర్బాగాంధీ బాలికల(కేజీబీవీ) విద్యార్థినులకు కాస్మోటిక్ ఛార్జీలు అందడం లేదు. ప్రతి విద్యార్థినికి నెలకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉన్నా.. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పైసా ఇవ్వలేదు. ఫలితంగా ఈ విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న బాలికలకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరకు ప్యాడ్స్ కొనేందుకు సైతం డబ్బుల్లేని పరిస్థితి నెలకొంది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన హెల్త్ కిట్‌లో.. విద్యార్థినులకు అవసరమైన సబ్బులతో పాటు నూనెడబ్బా, ప్యాడ్స్, బొట్టుబిల్లలు, పౌడర్ తదితర వస్తువులను అందిస్తుంది. ఈ కిట్ కొంత ఉపయోగకరమయ్యింది. కానీ అవి హఠాత్తుగా ఆగిపొయ్యాయి. అధికారుల నుంచి సమాచారమూ లేదు. సందేంట్లో సడేమియాలా కేజీబీవీల్లో ప్యాడ్స్‌ను ఒకరి దగ్గరే కొనాలంటూ కేజీబీవీ ఉన్నతాధికారి ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 25 కేజీబీవీలున్నాయి. ఇందులో మొత్తం 5,652 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. కాస్మోటిక్ ఛార్జీల కింద ఒక్కో విద్యార్థికి నెలకు రూ100 చొప్పున విడుదల చేస్తామన్న సర్కారు.. ఇప్పటికీ నయా పైసా చెల్లించలేదు. విద్యాసంవత్సరం చివరకు వచ్చిన ఈ సమయంలో విద్యార్థినులకు ఖాతాలు ప్రారంభించే పని చేస్తున్నారు. జిల్లాలో 5652 మంది విద్యార్థులకు నెలకు వంద చొప్పున ప్రతి నెలా రూ.5,65,200 చొప్పున సంవత్సరానికి రూ.67 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కేజీబీవీల్లో బలహీన సామాజిక వర్గాలకు చెందిన పేద విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు.
కేజేబీవీల్లో ప్యాడ్స్ దందా...
కేజీబీవీల్లో హెల్త్ కిట్ నిలిచిపోవడంతో ఇదే అదునుగా కేజీబీవీ ఉన్నతాధికారి ఒకరు తమకు సంబంధించిన వారి వద్ద నుంచి ప్యాడ్స్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఒక్కో ప్యాడ్ కిట్టు రూ.399 చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదే విషయమై సెక్టోరియల్ అధికారిని వివరణ అడగగా.. పెన్నులు, బుక్కులు అమ్మడానికి వచ్చినట్టే.. ప్యాడ్స్ అమ్మేందుకు వస్తున్నారేమోనని, తనకు తెలీదని అన్నారు. అధికారుల అనుమతి లేకుండా బయటి వ్యక్తులు కేజీబీవీల్లో ఎలా అడుగుపెడతారని ప్రశ్నించగా.. సమాధానం రాలేదు. ప్యాడ్స్ కొనుగోలు ఒత్తిడిపై ఆరా తీస్తామని ఎస్ఓ వనిత తెలిపారు.
కాస్మోటిక్ ఛార్జీలు విడుదల కాలేదు
కేజీబీవీల్లో కాస్మోటిక్ ఛార్జీలు విడుదల కాలేదు. కాస్మోటిక్ ఛార్జీలను నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రస్తుతం ఖాతాలు తీస్తున్నాం. ఖాతాలు ప్రారంభించిన తరువాత విద్యార్థినుల అటెండెంట్స్ ఆధారంగా జూన్ నుంచి డబ్బులు వేస్తారు.
సింగం వనిత(సెక్టోరియల్ అధికారి)