Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రిడిటేషన్ ప్రకటించిన బీఎఫ్‌హెచ్‌ఐ
- దేశంలోనే మొదటి ప్రభుత్వాస్పత్రిగా ఘనత
- సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు అభినందనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసీహెచ్) జాతీయ గుర్తింపు దక్కింది. తల్లి పాలను ప్రోత్సహించే ''బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇన్షియేటివ్ (బీఎఫ్‌హెచ్‌ఐ)'' అందించే ''బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రిడేషన్ (గ్రేడ్-1)'' లభించింది. తద్వారా దేశంలోనే ఈ ఘనత సాధించిన మొదటి ప్రభుత్వ దవాఖానాగా బాన్సువాడ ఎంసీహెచ్ రికార్డ్ సాధించింది. శిశువుల ఆరోగ్యం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 10 ప్రమాణాలను నిర్దేశించింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం మదర్స్ అబ్జల్యూట్ అఫెక్షన్ (ఎంఏఏ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఈ ప్రమాణాలకు అనుగుణంగా బ్రెస్ట్ ఫీడింగ్ను ప్రోత్సహిస్తున్న దవాఖానాలను యూనిసెఫ్, బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా (బీపీఎన్ఐ), అసోసియేషన్ ఆఫ్ హెల్త్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్ పీఐ) సంయుక్తంగా ఎంపిక చేసి బీఎఫ్‌హెచ్‌ఐ అక్రిడేషన్ ఇస్తున్నాయి. ఈ సర్టిఫికెట్ మూడేండ్ల పాటు అమల్లో ఉంటుంది.
బిడ్డ పుట్టిన అరగంటలోనే ముర్రుపాలు తగ్గించడంతో పాటు ఆరు నెలలపాటు తల్లిపాలు మాత్రమే తాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఐదేండ్ల లోపు పిల్లల మరణాలను 22 శాతం నివారించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బ్రెస్ట్ ఫీడింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్య సిబ్బంది, ఆశాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. బీపీఎన్ఐ సహకారంతో 35 మంది మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చింది. ప్రత్యేకంగా దేశంలోనే మొదటిసారిగా ''వాలంటరీ లాక్టేషన్ వర్కర్స్''ను నియమించింది. వీరు ఆస్పత్రుల్లో గర్భిణులకు, బాలింతలకు తల్లిపాలపై అవగాహన కల్పించడంతోపాటు ప్రసవమైన అరగంటలోనే పిల్లలకు ముర్రుపాలు పట్టిస్తున్నారు. ప్రస్తుతం బాన్సువాడ ఎంసీహెచ్‌లో ముగ్గురు వాలంటీర్లు ఉన్నారు. రెండు దఫాల పరిశీలన అనంతరం, ఢిల్లీ నుంచి ఇటీవల వచ్చిన ప్రత్యేక బృందం బాన్సువాడ ఎంసీహెచ్‌ను సందర్శించింది. అన్ని రకాల ప్రమాణాలు పాటిస్తున్నట్టు నిర్ధారించుకొని.. అక్రిడిటేషన్ మంజూరు చేసింది. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ, ప్రయివేటు కలిపి నాలుగు ఆస్పత్రులకు మాత్రమే ఈ అక్రీడిటేషన్ ఉంది.
మంత్రి అభినందనలు
బాన్సువాడ ఎంసీహెచ్‌కు బీఎఫ్‌హెచ్‌ఐ అక్రిడేషన్ రావడం పట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్య సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.