Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిదేండ్లలో లక్షల కోట్ల అప్పులు మాఫీ : బీజేపీపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- కేంద్ర మంత్రులు తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు
నవతెలంగాణ-గజ్వేల్
బడా వ్యాపారులకు, కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడా వ్యాపారులు ఎన్ని అప్పులు తీసుకున్న వాటిని కేంద్ర ప్రభుత్వం మాఫీ చేస్తోందని, అంతేకాకుండా రెడ్ కార్పొరేట్లకు ఎనిమిందేండ్లుగా రూ.లక్షల కోట్లు కేటాయించడమే కాకుండా రూ.12 లక్షల కోట్ల అప్పులను మాఫీ చేసిందని ఆరోపించారు. కానీ ఉపాధి హామీ పని దినాలను పెంచకుండా.. బడ్జెట్లో నిధులు పెంచకుండా పేద ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీస్తున్నదన్నారు. తెలంగాణలో ఉపాధికి రూ.30 వేల కోట్లు కోత పెట్టిందని, రాష్ట్రానికి బడ్జెట్లో ఏమాత్రం నిధులు కేటాయించలేదని తెలిపారు.
పైగా మంత్రులు నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారని ఆరోపించారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని ఎన్నో ఏండ్లుగా కోరుతున్నప్పటికీ.. అసలు ప్రతిపాదనలే రాలేదని కేంద్ర మంత్రి చెప్పడం సిగ్గు చేటన్నారు. 150 కళాశాలను ఇతర రాష్ట్రాలకు కేంద్రం కేటాయించినప్పటికీ.. తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేకపోయిందన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు జిల్లాల్లో మెడికల్ కాలేజ్‌లను ఏర్పాటు చేయనుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో లెక్కల ద్వారా చెప్పారని.. అది నూటికి నూరు శాతం వాస్తవమని తెలిపారు. బీజేపీ నెలకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెడుతుందని, 8 ఏండ్లలో 100 లక్షల కోట్లు ఖర్చుపెట్టి దేశాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు రావాల్సిన రూ.1350 కోట్లు రావటం లేదన్నారు. రైతులు గ్రామాల్లో నిర్మించుకున్న కల్లాల నిధులు రూ.150 కోట్లు రాష్ట్రానికి రావాల్సినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద కేవలం రూ.20 లక్షలు మాత్రమే ఖర్చు పెడుతున్నదన్నారు. కేంద్ర బడ్జెట్లో రైతులకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో కరీంనగర్, ఖమ్మం జిల్లా ప్రజలు బీజేపీ నాయకులకు కర్రు కాల్చి వాత పెడతారని తెలిపారు. విలేకరుల సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మ, ఎఫ్డీసీ చైర్మెన్ ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ మాదాసు శ్రీనివాస్, జిల్లా గ్రంధాల సంస్థ చైర్మెన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్ తదితరులు ఉన్నారు.