Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదాని కంపెనీలపై దాడులు లేవా?
- ప్రతిపక్ష నాయకులపై ఈడీ దాడులు దారుణం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ -నల్లగొండ
రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చే శక్తులను సమీకరించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో పోరాటాలు ఉధృతం చేస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఐ ఫంక్షన్హాల్లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల సంస్థలపై, వ్యక్తుల పైన ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి తప్ప ప్రధానమంత్రి మోడీ అనుచరుడైన అదాని, అతని సంస్థలపై దాడులు లేవా అని ప్రశ్నించారు. దేశంలో రోజురోజుకూ బీజేపీ నియంతృత్వ విధానాలు పెరిగిపోతున్నాయని, అందులో భాగంగానే మీడియా సంస్థలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసి పోరాటాలకు సన్నద్ధమవుతామని తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్రంలో బీఆర్ఎస్తో ఎన్నికల్లో పొత్తులు ఉంటాయన్నారు. ఇంతవరకు సీపీఐ(ఎం), బీఆర్ఎస్ మధ్య సీట్ల సర్దుబాట్లపై చర్చలు జరగలేదన్నారు. మీడియాలో వచ్చిన వార్తలు ఊహాజనితమన్నారు.
గత ఎన్నికల ముందు ప్రజలకు మోడీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదని విమర్శించారు. దేశంలో మతతత్వ దాడులు పెరిగాయని, హత్యలు, లైంగికదాడులు జరుగుతున్నా మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మార్చి 15 నుంచి 30 వరకు జాతా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు.
రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. 2022 వరకు దేశంలో ఇండ్లు లేని పేదవారు ఉండరని చెప్పిన ప్రధాన మంత్రి ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు కట్టించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో బుల్లెట్ ట్రైన్లు విషయం అతీగతి లేదని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగం, ఉదయ సముద్రం ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సాగర్ ఎడమ కాలువ లిప్టుల పనులను పూర్తి చేసి వెంటనే ఆపరేటర్‌ను నియమించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, డబ్బికారు మల్లేష్, బండ శ్రీశైలం, సయ్యద్ హాశం, కందాల ప్రమీల, పట్టణ కార్యదర్శి సలీం తదితరులు పాల్గొన్నారు.