Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎమ్‌డీ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైతులు వ్యవసాయ పంపుసెట్ల వద్ద ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించాలని తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) సీఎమ్‌డీ అన్నమనేని గోపాలరావు విజ్ఞప్తి చేశారు. దీనిపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఈఆర్సీ) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. 24 గంటలు విద్యుత్ సరఫరా ఉన్నందున రైతులకు ఆటోమేటిక్ స్టార్టర్లతో పనిలేదనీ, అవి ఉండటం వల్ల కరెంటుతో పాటు భూగర్భజలాలు కూడా నష్టపో వలసి వస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నదనీ, విద్యుత్ వృథా అయితే అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందనీ చెప్పారు. తిరిగి ఈ భారం ప్రజలపైనే పడుతుందని హెచ్చరించారు. విద్యుత్పు పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. అలాగే రైతులు తప్పనిసరిగా రేటింగ్ ఉన్న కెపాసిటర్లు బిగించుకోవాలని సూచించారు. దీనివల్ల ఓల్టేజీ హెచ్చుతగ్గులు నియంత్రించబడి, మోటర్లపై భారం తగ్గుతుందన్నారు. ఈ విషయంలో రైతులు తమ సంస్థకు సహకరించాలని కోరారు.