Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోటిఫికేషన్ విడుదల చేసిన రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి రాకేష్ మిత్తల్
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించేందుకు రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి రాకేష్ మిత్తల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మొత్తం 8 వార్డులు ఉన్నాయి. ఇతర కంటోన్మెంట్లలో మూడు నుంచి ఐదు వరకే వార్డులు ఉన్నాయి. అయితే ఓ పక్క జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం విషయం పరిశీలన ఉంది. అయితే, దీనిపై పార్లమెంట్లో నూతన చట్టం బిల్లు ఆమోదానికి చర్చకు రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 2006 చట్ట ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుతోపాటు దేశంలో ఉన్న మరో 56 కంటోన్మెంట్లకు ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్లో పేర్కొంది. 2015లో చివరిసారిగా పాలకమండలి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి నూతన చట్టం అమల్లో వస్తుందని ఎన్నికలు ఎప్పటికప్పుడూ వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, కొన్ని కంటోన్మెంట్లలో మాజీ సభ్యులు స్థానిక న్యాయస్థానాలను ఆశ్రయించటంతో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితులలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. 2005లో 1924 చట్ట ప్రకారం ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత 2006లో చట్టాన్ని మార్పు తేవడంతో 2005లో ఎన్నికైన పాలకమండలిని రద్దు చేశారు. ఇప్పుడు కూడా 2020 బిల్లు ఆమోదం పొందితే మళ్లీ రద్దు అయ్యే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం 2006 చట్టప్రకారమే ఏప్రిల్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది.కంటోన్మెంట్లలో అభివృద్ధి కుంటుపడటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్పకనే చెప్తున్నారు.