Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవ తెలంగాణ - మహబూబ్‌నగర్
ఎట్టి పరిస్థితుల్లోనూ పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట పెద్ద శివాలయంలో శనివారం దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగల్ ఇచ్చిన నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయితేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఒక న్యాయమైన కోరిక అని, కరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అత్యవసరమన్నారు. సాగునీటి లభ్యత పెరిగితే జిల్లా స్వరూపమే మారుతుందన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నాయన్నారు. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎండాకాలంలో కూడా వాగుల్లో పుష్కలంగా నీరు ప్రవహిస్తోందన్నారు. చెరువుల పూడికతీత వల్ల సాగునీటి లభ్యత పెరిగిందన్నారు. ఎన్నో ప్రాజెక్టులను పూర్తిచేసిన తమ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును కూడా పూర్తి చేసి అన్నదాతకు అండగా నిలుస్తుందన్నారు.