Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, టీటీడీ డిప్యూటీ ఈవో హరింద్రనాథ్
- వీఐపీల సేవలో అధికారులు..
- లైన్లలో సందర్శకుల తిప్పలు
నవతెలంగాణ - వేములవాడ
రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం శనివారం శివ నామస్మరణతో మారుమోగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు లైన్లలో బారులు తీరారు. దర్వనానికి దాదాపు 10-12 గంటల సమయం పట్టింది. మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి పట్టువస్త్రాలను సమర్పించారు. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున డిప్యూటీ ఈవో హరింద్రనాథ్ పట్టు వస్త్రాలు సమర్పించారు.స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వీఐపీలు రావడంతో సామాన్య సందర్శకులకు ఇబ్బందులు తప్పలేదు. ముఖ్యంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం దాదాపు గంటపాటు ఆలయంలోనే ఉండటంతో సందర్శకుల లైన్లు ముందుకు కదలలేదు. దీంతో వేకువజాము నుంచి దాదాపు 10 గంటల పాటు లైన్లలో వేచి ఉన్న జనం అసహనం వ్యక్తం చేస్తూ, ఈవో డౌన్ డౌన్, పోలీసులు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజరు వచ్చిన సమయంలోనూ పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మంది ఆయనతో కలిసి ఆలయం లోపలికి వెళ్లగా జనానికి ఇబ్బందులు తప్పలేదు.