Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సింగూరు జలాలు మెదక్ హక్కు' నినాదాన్ని నిజం చేసినం
- సంగారెడ్డి జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పథకాలు
- కొందరిలా మతాన్ని రాజకీయాలకు వాడే బుద్ది మాకు లేదు : ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు
- 1.65 లక్షల ఎకరాలకుసాగునీరిచ్చే బసవేశ్వర లిప్టుకు భూమిపూజ
నవతెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కరువు పీడిత ప్రాంతంగా నెర్రెలు వారిన తెలంగాణ నేలంతా కేసీఆర్ పరిపాలనాదక్షతతో సస్యశ్యామలంగా మారుతోందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హారీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలం బోరంచ గ్రామంలో రూ.1774 కోట్లతో నిర్మించతలపెట్టిన బసవేశ్వరం లిప్టు ఇరిగేషన్ పథకం పనులకు శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల 'సింగూరు జలాలు మెదక్ హక్కు' అనే నినాదం గోడ రాతల్లో కనిపించేదని, తెలంగాణ వచ్చాక నిజం చేసి బీడుభూముల్ని సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. 471 మీటర్ల ఎత్తులో ఉండే మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను తెచ్చి కరువు ప్రాంతమైన నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు బసవేశ్వర, సంగమేశ్వర లిప్టు పథకాల పనులు చేపట్టామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరందించే పథకాల పనులు జరుగుతున్నా యన్నారు. నారాయణఖేడ్ ప్రాంతానికే ఇప్పుడు ఐదారు రాష్ట్రాల నుంచి ప్రజలు వలసలొచ్చి బతికేంత అభివృద్ధి ఇక్కడ జరిగిందన్నారు. కొందరు దేవుళ్లను రాజకీయాలకు వాడుకుంటుంటే కేసీఆర్ మాత్రం నమ్మకం, విశ్వాసంతో అభివృద్ధి, ప్రగతి బాటన నడుస్తున్నారని చెప్పారు. బీజేపీ వాళ్లేమో మతాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయంగా లబ్దిపొందేం దుకు ఎన్నికల ముందు గుళ్లు కట్టడం, ప్రారంభిం చడం చేస్తున్నారని, కేసీఆర్ మాత్రం అభివృద్ధి కోణంలోనే యాదాద్రిని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దార న్నారు. ప్రాజెక్టుల కోసం భూముల్ని ఇచ్చి సహకరి స్తున్న నిర్వాసితులకు మెరుగైన పరిహారంతోపాటు దళితబంధు, డబుల్బెడ్రూం ఇండ్లు, వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాల్లో తొలి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, కలెక్టర్ శరత్, చీఫ్ ఇంజినీర్ అజరు, ఎస్పీ రమణకుమార్ పాల్గొన్నారు.