Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊర్లో లేకుంటే పక్కూరోళ్లతో చేయిస్తున్న వైనం
- పనిలోనేకాదు..జీతాల్లోనూ వివక్షే
- నాలుగైదు వేల రూపాయలతో
బతికేదెట్టాగో పాలకులే చెప్పాలి
- అదీ మూడు నుంచి ఐదు నెలల దాకా పెండింగ్లోనే
- మురికి కూపంలో పనితో రోగాలమయం
- అప్పులు చేసి బతుకుతున్న కార్మికులు
- ఒంటరి మహిళలే ఎక్కువ..చదువూ అంతంతే
క్షేత్రస్థాయిలో యాడజూసినా మోరీలెత్తేదంతా దళితులే. వీరుగాక మిగతా సామాజిక తరగతుల వారెవ్వరూ ఆ పనిచేసేందుకు ముందుకు రావడం లేదు. ఒకవేళ ఆ ఊర్లో లేకుంటే ఆ పని వరకు పక్కూరోళ్లను పెట్టి చేయిస్తున్న ధైన్యపరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. తండాల్లో మాత్రం అక్కడక్కడా కొందరు గిరిజనులు పనిచేస్తున్నారు. మోరీల్లోని చెత్తను, రోతను ఎత్తివేసే క్రమంలో ఆ వాసనను భరించేందుకు తాగుడు అలవాటు చేసుకుని కొందరు, పనిచేసే క్రమంలో రోగాలపాలై మరికొందరు అర్ధాయుష్యుతో తనువు చాలిస్తున్నారు. తమ ఆలుబిడ్డల్ని అనాథల్ని చేసిపోతున్నారు. చనిపోతే ఏదో మొక్కుబడిగా సర్పంచులు రూ.10వేలు, 20 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్ప ఆ కుటుంబానికి పూర్తిస్థాయిలో భరోసా ఇస్తున్న పరిస్థితి లేదు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వంశపారంపర్యంగా ఆ పనులే చేసుకుని బతికేలా సమాజం గిరిగీసి వారిని అందులో బంధించేసింది. ఆ పని చేస్తున్నారన్న కనీస సానుభూతి చూపే వారికన్నా ఛీ..ఛీ అంటూ ఈసడించుకుంటూ ముక్కుమూసుకుని పోయేవారే ఎక్కువ. అటు సామాజికంగా, ఇటు పనిపరంగానూ వివక్ష ఎదుర్కొంటూ ఎవ్వరూ చేయలేని పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర సర్కారు ఇస్తున్నది అక్షరాలా రూ.8,500 మాత్రమే. దానికే పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నది. ఆ జీతమూ అందుతుందా అంటే అదీ లేదు. దాన్నీ ఇద్దరు, లేదా ముగ్గురు పంచుకోవాల్సి వస్తుండటంతో కార్మికుల చేతికి నాలుగైదు వేల రూపాయలకు మించి అందట్లేదు. అందులోనూ మూడు నాలుగు నెలలకోసారి, కొన్ని మండలాల్లో ఆరేడు నెలలకోసారి ఇస్తున్న దౌర్భాగ్య పరిస్థితి.తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామపంచాయతీ కార్మికుల పిల్లలు మధ్యలోనే చదువులకు స్వస్తి చెబుతున్నారు. కూలినాలి చేసుకుని బతుకుతున్నారు. గ్రామాల్లో మోరీలు తీసేవారిలో పురుషుల్లో ఎక్కువగా ముసలివారు, స్త్రీలల్లో ఒంటరి మహిళలే నూటికి 99 శాతం కనిపిస్తున్నారు. ఒంటరి మహిళల భర్తలు గతంలో ఇదే పనిచేసేవారు. వారు చనిపోవడంతో భర్తల స్థానంలో విధిగా ఆ పనిచేయాల్సిన దౌర్భాగ్య స్థితికి వారు నెట్టివేయబడుతున్నారు. మోరీల్లో నుంచి పేరుకుపోయి చెత్త, ఇసుక, రోతను ఎత్తివేసే క్రమంలో వారు ఎక్కువ అంటువ్యాధులకు గురవుతున్నారు. వారికి వైద్యం చేయించుకునేందుకు చేతిలో డబ్బుల్లేక, ఈఎస్ఐ లేక ఆ రోగాలతోనే కుంగికృశించి చనిపోతున్నారు. పనిచేసే ఒంటరి మహిళల్లో 30 ఏండ్ల వారు కూడా కనిపించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నియోజకవర్గంలోని కొన్ని ఊర్లలో శవాలమీద పేలాలు ఏరుకుని తిన్నట్టుగా గ్రామపంచాయతీ కార్మికుల నుంచి రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. 'మేం పెట్టిచ్చినం. నెలకు ఇంత ఇస్తే ఉంచుతాం. లేకుంటే పనిచేస్తలేరని పీకేస్తం' అంటూ సర్పంచులు బెదిరిస్తున్నారని ఓ మహిళా పారిశుధ్య కార్మికురాలు వాపోయింది. అదే సమయంలో జీతాలు రాకుండా ఇబ్బంది పడుతున్న కార్మికులకు వారి కుటుంబాలు నడిచేలా సర్పంచులు ఎంతో కొంత ఇచ్చి జీతాలు పడ్డాక తీసుకుంటున్న పరిస్థితి కూడా క్షేత్రస్థాయిలో ఉంది. పాలకుర్తి నియోజకవర్గంలో నాలుగు నుంచి 8 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. జీతాల్లేక కార్మికులు అప్పులు చేసుకుని బతుకుతున్నారు. మంత్రి నియోజకవర్గంలోని ధర్మపురం గ్రామంలోని ఇద్దరు గ్రామపంచాయతీ కార్మికుల కుటుంబాలు మొదటి నుంచీ కాంగ్రెస్కు అనుబంధంగా ఉంటూ వస్తున్నాయి. అక్కడ టీఆర్ఎస్ సర్పంచి గెలిచాక ఇద్దర్నీ తీసేసి తమకు అనుకూలంగా ఉన్నవారిని పెట్టుకున్నారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా విధుల్లోకి మాత్రం తీసుకోలేదు. ఇవేకాదు..ఏ పంచాయతీ కార్మికుడ్ని కదిలించినా ఒకొక్కరిది ఒక్కో గాథ. అయినా, వారు తమ సమస్యలు చెప్పడానికి భయపడుతున్నారు. దీనికి కారణం మల్టీపర్పస్ బాండ్ పేపరు రాయించుకోవడమే. తాము చెప్పినట్టు ఉంటేనే పనిలో కొనసాగనిస్తాం. లేకుంటే తీసేస్తాం అనే బెదింపు ధోరణి క్షేత్రస్థాయిలో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. దీంతో సర్పంచ్లకు భయపడి వారి వ్యవసాయ పనులు, ఇంటి పనులు కూడా చేస్తున్నారు. ఎలక్ట్రిషియన్లు, వాటర్మెన్లు నిరంతరం విధుల్లో ఉండాలి. వారి రక్షణ కోసం సర్కారు ఏ ఒక్కటీ చేయడం లేదు. ఉదయం 6 గంటల నుంచి 10, 10:30 వరకు- మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఐదారు గంటల దాకా ఎవ్వరూ చేయలేని పనిని చేస్తున్న వారికి కనీసం ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కూడా లేవు. రోగమొచ్చినా, నొప్పొచ్చినా సొంతపైసలు పెట్టుకుని చూపించుకోవాల్సిందే. కారోబారు, బిల్ కలెక్టర్లు సైతం చాలా అవమాన భారంతో పనిచేస్తున్నారు. వారే ట్రాక్టర్లు నడుపుతున్నారు. లైట్లు వేస్తున్నారు. కొన్నిచోట్లనైతే మోర్లలో మట్టికూడా తీస్తున్న పరిస్థితి ఉంది. కొన్నిచోట్ల నాలుగైదు పనులు చెప్పి టార్గెట్లు పూర్తిచేయలేదని వేధిస్తున్నారు.
'మాకు జీతం పెంచితేనే మంచిది బిడ్డా'
'గీ పనిజేస్కుంట ఉన్ననాడు తింటున్నం. లేనినాడు ఉపాసంతోని పండుతున్నం. ఉప్పుపప్పులు, బియ్యం మస్తు పిరమాయే. నాలుగైదు వేలు బతుకుతందుకు ఎట్ల సరిపోతయి కొడకా? అదీ మూడు నాలుగు నెలల కోసారి ఇస్తుర్రు. మేంగాబట్టి జేస్తున్నంగానీ ఈ రోత పని లక్ష రూపాయలిచ్చినా ఎవ్వరు చేయరుబిడ్డ. మాకు జీతం పెంచితేనే మంచిది బిడ్డా' అని జనగామ జిల్లా, మండల కేంద్రానికి చెందిన ఓ పంచాయతీ కార్మికురాలు అన్నది. 'పొద్దుగాల కోడికూసే జాముకే లేచి పొరుకా, పార పట్టుకుని బోతం. ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల బాగోలును పట్టించుకుంటలేం. వాళ్లూ చదువూసంధ్యలేక మాలెక్కనే తయారైతున్నరు' అంటూ తరిగొప్పుల మండలానికి చెందిన మరో మహిళకార్మికురాలు వాపోయింది.
మమ్ముల్ని రాచిరంపాన పెడ్తరు...
''పేర్లు చెప్పండమ్మా... మీ ఫొటోలు తీసుకుని వార్త రాస్తామమ్మా...''అంటే.. 'వద్దు బిడ్డా. మీరు పోయినంక మమ్ముల్ని రాచిరంపాన పెడ్తరు. ఏందమ్మో ఎక్కువైందా అంటూ ఎచ్చిడిజేస్తరు. పగబడుతరు. ఈపాటి బతుకుదెరువు కూడా లేకుండ జేస్తరు' అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన 60 ఏండ్ల మహిళా పంచాయతీ కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేసింది.