Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్ట సవరణపై కేంద్రం తాత్సారం..
- 75 ఏండ్ల గుర్తింపే సమస్య అంటున్న గిరిజన శాఖ
- అర్హత కలిగిన అందరికీ హక్కుపత్రాలకోసం ఆందోళన
- తిరస్కరించినవి పున:పరిశీలించాలనే డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు భూముల హక్కు పత్రాల కోసం సాగుదారులు ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల చివరినాటికి అర్హత కలిగిన అందరికీ హక్కుపత్రాలిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 4,14,353 లక్షల మంది నుంచి 12,46,846 లక్షల ఎకరాల అటవీ భూముల కోసం అర్జీలు అందాయి. కొన్ని చోట్ల ఎలాంటి సర్వేలు చేయకుండానే దరఖాస్తులను తిరస్కరించారన్న విమర్శలు లేకపోలేదు. మరి కొన్ని చోట్ల కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించలేదన్న ఆరోపణలు సైతం వస్తున్నాయి. రకరకాల కొర్రీలతో దరఖాస్తులను తిరస్కరించినట్టు తెలుస్తున్నది. అలాంటి దరఖాస్తులను పున:పరిశీలించాలని వారు కోరుతున్నారు. ఇందులో గిరిజనులు, గిరిజనేతరులూ ఉన్నారు.
మూడు తరాల రుజువు సమస్య..
2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబరు 13 ముందు వరకు సాగులో ఉన్న గిరిజనులకు పత్రాలు ఇవ్వాల్సి ఉంది. గిరిజనేతరులకు కూడా ఇదే చట్టం ప్రకారం 75 ఏండ్ల నుంచి అంటే మూడు తరాల నుంచి సాగులో ఉన్నట్టు రుజువు ఉంటే హక్కు పత్రాలివ్వొచ్చని నిబంధన ఉంది. ఇదే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే గిరిజనేతరులకు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా హక్కుపత్రాలు ఇవ్వొచ్చని వారు చెబుతున్నారు. ప్రస్తుత పరిశీలన ప్రకారం చూస్తే- గిరిజనులకే హక్కు పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు సమాచారం. దీంతో గిరిజనేతరుల్లో ఆందోళన మొదలైంది. తరతరాలుగా ఇక్కడే బతుకుతున్నామంటూ ..ఇప్పుడు హక్కుపత్రాలు ఇవ్వబోమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల గిరిజనేతరుల అంశం ఎటూ తేలకపోవడంతో అధికార పార్టీ నేతల్లో సైతం ఆందోళన మొదలైంది. పరిశీలనలో తిరస్కరణకు గురవుతున్న దరఖాస్తులో అధికంగా గిరిజనేతరులవే ఉన్నట్టు సమాచారం. 75 ఏండ్ల రుజువు కలిగిన గిరిజనేతరులు అతి తక్కువ మంది తేలడం గమనార్హం! ఈ నిర్దారణ కూడా శాస్త్రీయంగా లేదనే విమర్శలున్నాయి. శాటిలైట్ సర్వే గాకుండా..గ్రామ సభలద్వారా గిరిజనేతరుల్లో అర్హులను గుర్తించి, చట్ట ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని ఇప్పటికే ఆదివాసీ, అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పోడు పత్రాలపై గిరిజన శాఖ తర్జనబర్జన పడుతున్నది. గిరిజనులందరికీ హక్కుపత్రాలిస్తామని సర్కారు ప్రకటించినప్పటి నుంచి గిరిజనేతరుల అంశంపై తీవ్ర చర్చ సాగుతున్నది.
సమస్యపై కేంద్రానికి లేఖ..
గిరిజనులకు పోడు హక్కు పత్రాలు ఇవ్వడంపై 2006 అటవీ హక్కు చట్టంలో స్పష్టమైన వివరాలు ఉండడంతో ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ, గిరిజనేతరులకు ఇచ్చే అంశం మాత్రం 75 ఏండ్ల రుజువుకు ముడిపడి ఉండడంతో ముందుకెళ్లలేకపోతున్నారు. పోడు భూములు, ఇతర అంశాలు మొత్తం కేంద్రం పరిధిలో ఉండటంతో 75 ఏండ్ల గుర్తింపు అంటే ఇబ్బంది అవుతోందని.. దీనిపై కొంత సడలింపు కావాలని కోరుతూ గిరిజన శాఖ కేంద్రానికి ఏడాది క్రితమే లేఖ రాసినట్టు తెలిసింది. కనీసం కటాప్ తేదీని 2018 వరకు పొడింగించాలని కోరినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తున్నదని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.
జిల్లా స్థాయి కమిటీలకు దరఖాస్తులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజనుల్లో అర్హులైన వారికి పోడు హక్కు పత్రాలు అందించేందుకు ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తులు గ్రామస్థాయి నుంచి సబ్ డివిజనల్ స్థాయిలో పరిశీలన పూర్తిచేసుకుని జిల్లా కమిటీలకు చేరాయి. ఈ కమిటీల్లో మరోసారి పరిశీలన జరగనుంది. ఇక్కడ తిరస్కరించిన దరఖాస్తులను తిరిగి గ్రామస్థాయికి పంపనున్నారు. ఎందుకు తిరస్కరించారన్న వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేయాల్సి ఉంది. అనంతరం వారు మళ్లీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
తక్షణం హక్కు పత్రాలివ్వాలి
పోడు సాగుదారులందరికీ తక్షణమే హక్కుపత్రాలు ఇవ్వాలి. హక్కు పత్రాలు లేకపోవటంతో రైతు బంధు, బీమా తదితర సౌకర్యాలకు దూరమయ్యారు. చట్టంలో ఉన్న ప్రకారం గిరిజనేతరులకు కూడా హక్కు పత్రాలివ్వాలి. రకరకాల నియమాల పేరుతో వాటిని నిరాకరించటం సరికాదు. అటవీ హక్కుల గుర్తింపు చట్టంలో రెండు సవరణలు చేయాలని ఆరు నెల్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం..కేంద్రానికి లేఖ రాసింది. దానిపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయటం పోడు రైతులపై ఆ సర్కారుకున్న ప్రేమ ఏపాటిదో తెలియజేస్తున్నది. దీంతో వేలాది మంది గిరిజనేతరులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా స్పందించాలి. లేదంటే ఉద్యమాలు తప్పవు.
- ఆర్ శ్రీరాంనాయక్
ప్రధాన కార్యదర్శి తెలంగాణ గిరిజన సంఘం