Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది వికెట్ల ప్రదర్శనతో మాయాజాలం
- రెండో టెస్టులో భారత్ ఘన విజయం
- ఛేదనలో మెరిసిన రోహిత్, పుజార, కోహ్లి
2-0తో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌పై పట్టు
ఫిరోజ్ షా కోట్లలో మరోసారి మాయ. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో కనీసం రెండు సార్లు మ్యాచ్‌ను కోల్పోయామనే దుస్థితిలో నిలిచిన టీమ్ ఇండియా.. 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం నమోదు చేసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-0 ఆధిక్యంతో పదిలం చేసుకుంది. రవీంద్ర జడేజా (7/42) కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో చివరి 8 వికెట్లను 28 పరుగులకే కోల్పోయింది. 113 పరుగులకే ఆసీస్‌ను కుప్పకూల్చిన భారత్.. సవాల్‌తో కూడిన స్వల్ప లక్ష్యాన్ని 26.4 ఓవర్లలోనే ముగించింది. రోహిత్ శర్మ (31), పుజార (31 నాటౌట్), విరాట్ కోహ్లి (20) రాణించారు. సిరీస్‌లో మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్‌లో జరుగనుంది
నవతెలంగాణ-న్యూఢిల్లీ
కష్టసాధ్యంగా మారిన రెండో టెస్టులో టీమ్ ఇండియా కండ్లుచెదిరే విజయం సాధించింది. రవీంద్ర జడేజా (7/42), రవిచంద్రన్ అశ్విన్ (3/59) మాయజాలంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 113 పరుగులకే కుప్పకూలింది. 115 పరుగుల సవాల్‌తో కూడిన ఛేదనను టీమ్ ఇండియా 26.4 ఓవర్లలోనే ముగించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (31, 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), చతేశ్వర్ పుజార (31 నాటౌట్, 74 బంతుల్లో 4 ఫోర్లు), విరాట్ కోహ్లి (20, 31 బంతుల్లో 3 ఫోర్లు), తెలుగు తేజం కె.ఎస్ భరత్ (23 నాటౌట్, 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. రెండో టెస్టులో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 2-0తో తిరుగులేని ముందంజ వేసింది. చివరి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా విజయం సాధించినా.. సిరీస్‌ను, ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో చోటు ఖాయం చేసుకుంది. తొలి సెషన్లోనే కుప్పకూలిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిశ్ హెడ్ (43, 46 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), మార్నస్ లబుషేన్ (35, 50 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. పది వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
28 పరుగులకే 8 వికెట్లు
ఓ వైపు ఆస్ట్రేలియా వేగంగా పరుగులు రాబడుతోంది. మరోవైపు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కంగారూలకు ప్రాణ సంకటంగా మారుతున్నాడు. ఈ మధ్యలో రవీంద్ర జడేజా ఓవర్లలలో ఆసీస్ పరుగులు పిండుకుంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఇలా సాగుతున్న పరిస్థితి.. ఒక్కసారిగా మ్యాజిక్ తరహాలో మారిపోయింది. అప్పటి వరకు ఆసీస్‌కు పరుగులు సమర్పించుకునే పనిలో ఉన్న జడేజా... ఆసీస్‌కు రివర్స్ పంచ్ ఇచ్చాడు. రివర్స్ స్వీప్ ఆడుతున్న ఆసీస్ ఆటగాళ్లను చూస్తుండగానే పెవిలియన్ దారి పట్టించాడు. 86/2తో భారీ స్కోరు దిశగా సాగుతున్న ఆస్ట్రేలియా జడేజా దెబ్బకు చివరి 8 వికెట్లను 28 పరుగులకే చేజార్చుకుంది. కనీసం 150 పరుగులైనా చేసేలా కనిపించిన ఆస్ట్రేలియాను జడేజా 113 పరుగులకే పరిమితం చేశాడు. అశ్విన్ (3/59) సైతం రాణించటంతో తొలి సెషన్లోనే ఆస్ట్రేలియా కుప్పకూలింది.
ట్రావిశ్ హెడ్ (43), స్టీవ్ స్మిత్ (9), మాట్ రెన్షా (2)లను అశ్విన్ అవుట్ చేయగా.. మిగతా బ్యాటర్ల సంగతి జడేజా చూసుకున్నాడు. తొలి ఆరు ఓవర్లలో వికెట్ లేకుండా 31 పరుగులు సమర్పించుకున్న జడేజా ఆ తర్వాత ప్రతాపం చూపించాడు. రివర్స్ స్వీప్ షాట్లతో భారత్‌పై ఎదురుదాడి చేసిన కంగారూ బ్యాటర్లను.. అదనపు పేస్, స్పిన్, స్ట్రెయిట్ బంతుల వైవిధ్యంతో బోల్తా కొట్టించాడు. ఆస్ట్రేలియా 95 పరుగుల స్కోరు వద్ద ఏకంగా నాలుగు వికెట్లను కోల్పోయింది. లబుషేన్, రెన్షా, హ్యాండ్స్కాంబ్, కమిన్స్‌లు ఒకే స్కోరు వద్ద అవుటయ్యారు. ఓవర్‌నైట్ స్కోరు 62/1తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా.. ఓ దశలో 86/2తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. జడేజా మాయతో 8 వికెట్లను 28 పరుగులకే కోల్పోగా.. 27 స్వీప్ షాట్లతో ఆసీస్ విలువైన 71 పరుగులు పిండుకుని భారత ఫీల్డింగ్ ప్రణాళికలను తికమక చేసింది.
ఛేదనలో దూకుడు
115 పరుగుల ఛేదన భారత్‌కు సైతం సవాల్ విసిరింది. లంచ్ లోపే ఛేదనకు వచ్చిన టీమ్ ఇండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ (1)ను ఇన్నింగ్స్ ఏడో బంతికే కోల్పోయింది. 14/1తో లంచ్ విరామానికి వెళ్లిన టీమ్ ఇండియా.. ధనాధన్ ప్రణాళికలతో వచ్చింది. ఓ ఎండ్‌లో చతేశ్వర్ పుజార (31 నాటౌట్) వికెట్లను కాపాడగా.. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ ఎదురుదాడి చేశాడు. నాథన్ లయాన్పై వరుసగా 6, 4 బాదిన రోహిత్.. కుహ్నేమాన్నూ సిక్సర్ బాదకుండా వదల్లేదు. 20 బంతుల్లోనే 31 పరుగులు పిండుకున్న రోహిత్.. క్రీజులో సౌకర్యంగా కనిపించాడు. పుజారను రెండో పరుగుకు పిలిచిన రోహిత్..తనే రనౌట్‌గా నిష్క్రమించాడు. అప్పటికి భారత్ స్కోరు 39/2. ఆ తర్వాత విరాట్ కోహ్లి (20, 31 బంతుల్లో 3 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (12, 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) అదే ఫార్ములా పాటించారు. తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ (23 నాటౌట్, 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దేశవాళీ దమ్ము చూపించాడు. మూడు ఫోర్లు, ఓ సిక్సర్ బాదిన భరత్.. పుజారతో కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 30 పరుగులు జోడించాడు. కెరీర్ వందో టెస్టులో పుజార మెగా ఇన్నింగ్స్ ఆడకపోయినా.. జట్టుకు అత్యంత విలువైన ఇన్నింగ్స్ నమోదు చేశాడు. 74 బంతులు ఎదుర్కొన్న పుజార అజేయంగా 31 పరుగులు సాధించాడు. బౌండరీతో జట్టుకు గెలుపు పరుగులు అందించాడు. 26.4 ఓవర్లలోనే 118 పరుగులు చేసిన భారత్ టీ విరామం లోపే లాంఛనం ముగించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండో టెస్టు సైతం మూడు రోజుల్లోనే ముగిసింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయాన్ (2/49) రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 263/10
భారత్ తొలి ఇన్నింగ్స్ : 262/10
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : ఉస్మాన్ ఖవాజ (సి) అయ్యర్ (బి) జడేజా 6, ట్రావిశ్ హెడ్ (సి) భరత్ (బి) అశ్విన్ 43, లబుషేన్ (బి) జడేజా 35, స్మిత్ (ఎల్బీ) అశ్విన్ 9, మాట్ రెన్షా (ఎల్బీ) అశ్విన్ 2, హ్యాండ్స్కాంబ్ (సి) కోహ్లి (బి) జడేజా 0, అలెక్స్ కేరీ (బి) జడేజా 7, కమిన్స్ (బి) జడేజా 0, నాథన్ లయాన్ (బి) జడేజా 8, టాడ్ మర్ఫీ నాటౌట్ 3, కుహ్నేమాన్ (బి) జడేజా 0, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం : (31.1 ఓవర్లలో ఆలౌట్) 113.
వికెట్ల పతనం : 1-23, 2-65, 3-85, 4-95, 5-95, 6-95, 7-95, 8-110, 9-113, 10-113.
బౌలింగ్ : అశ్విన్ 16-3-59-3, మహ్మద్ షమి 2-0-10-0, జడేజా 12.1-1-42-7, అక్షర్ పటేల్ 1-0-2-0.
భారత్ రెండో ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ రనౌట్ 31, కెఎల్ రాహుల్ (సి) అలెక్స్ (బి) లయాన్ 1, పుజార నాటౌట్ 31, విరాట్ కోహ్లి (స్టంప్డ్) అలెక్స్ (బి) మర్ఫీ 20, శ్రేయస్ అయ్యర్ (సి) మర్ఫీ (బి) లయాన్ 12, కె.ఎస్ భరత్ నాటౌట్ 23, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం : (26.4 ఓవర్లలో 4 వికెట్లకు) 118.
వికెట్ల పతనం : 1-6, 2-39, 3-69, 4-88.
బౌలింగ్ : మాథ్యూ కుహ్నేమాన్ 7-0-38-0, నాథన్ లయాన్ 12-3-49-2, టాడ్ మర్ఫీ 6.4-2-22-1, ట్రావిశ్ హెడ్ 1-0-9-0.