Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం రూ.26 వేలివ్వాలి
- కార్మికుల స్థితిగతులపై సోయిలేని పాలకులు
- ప్రధానితో పోరుకు కేసీఆర్ సిద్ధం కండి.. మేమూ మీ వెంట వస్తాం : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
- నేటి నుంచి పారిశ్రామిక కార్మికుల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో సర్వే
నవతెలంగాణ- భువనగిరి
గ్రామపంచాయతీ కార్మికులను మనుషులుగా చూడాలని, సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొన్న వారికి ఆరోగ్య సమస్యలు వచ్చినా మొక్కవోని ధైర్యంతో గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారమే తమ లక్ష్యంగా పాలకుర్తి నుంచి పట్నం వరకు ముందుకు పోతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య తెలిపారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ కూడిన బృందం చేపట్టిన పాదయాత్ర ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుకున్నది. రైల్వేస్టేషన్ నుంచి భువనగిరి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి బృందం సభ్యులు పూలమాలలేశారు. భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి, భువనగిరి పట్టణం, పగిడిపల్లి, బీబీనగర్ వరకు యాత్ర కొనసాగింది. అనంతరం దాసరి పాండు అధ్యక్షతన భువనగిరి వినాయక చౌరస్తా వద్ద జరిగిన సభలో వీరయ్య గ్రామ పంచాయతీ కార్మికులకు మద్దతు తెలిపి మాట్లాడారు.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు పరిశుభ్రంగా ఉండాలన్న సోయి పాలకులకు లేదన్నారు. ఆధునిక రాకెట్, ఇంటర్నెట్ యుగంలో మనుషుల మధ్య కులం, మతం పేరిట విభేదాలు సృష్టిస్తున్నారని తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచకుండా, పర్మినెంట్ చేయకుండా దాటవేస్తున్నారన్నారు. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజా అన్న ప్రధానమంత్రి మోడీకి పారిశుధ్య కార్మికుల వేతనంలో అంతరాలు ఉండకూడదనే జ్ఞానం లేదని విమర్శించారు. గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నడిరోడ్డు మీద ప్రజల గుడ్డలు విప్పినా నోరు మెదపలేదని ఆరోపించారు. కార్మికులకు న్యాయం చేయలేని మోడీ ఉన్నా లేకున్నా ఒక్కటేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులకు రూ.300 ఉంటే నేడు రూ.8500 ఒక్కొక్క కార్మికులకు చెల్లిస్తున్నామని కెేసీఆర్ చెప్పారన్నారు. ఇది ఆచరణలో అమలు కాలేదన్నారు. ఒక్కరికి రూ.8500 వేసి మిగతా వారిని పంచుకోమని చెప్తున్నారని తెలిపారు. సీపీఐ(ఎం) ఆధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కార్మికులకు రూ.8500 వేతనం అమలవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులను చేయనీయకుండా చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రాలకు వచ్చే ఆదాయం రాకుండా కేంద్రానికే నేరుగా ఆదాయం వచ్చేటట్టు చేశారని ఆరోపించారు. రాష్ట్రాలకు కేటాయించిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీతో కొట్లాడటానికి సిద్ధమైతే కార్మికులందరూ మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 28వ తేదీ వరకూ కొనసాగనున్న పాదయాత్ర ముగింపు లోపు ప్రభుత్వం స్పందించాలని, లేని యేడల ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, ఈనెల 20 నుంచి మార్చి 5వ తేదీ వరకు రాష్ట్రంలో పారిశ్రామిక కార్మికుల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. సుమారు 12 ఏండ్ల కింద నిర్ణయించిన వేతనాలనే పారిశ్రామిక యాజమాన్యాలు నేటికీ అమలు చేయడం లేదన్నారు.
గ్రామ పంచాయతీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గ్యార పాండు, వెంకటయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు ఇస్తున్నట్టుగా జీపీ కార్మికులకు వేతనాలు పెంచాలన్నారు. జీవో నెం 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైళ్ళ గణపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వినోద్ కుమార్, మహేష్ పాదయాత్ర బృందం సభ్యులు, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి గోపాలస్వామి, నాగర్కర్నూల్ జిల్లా నాయకులు బత్తిని వెంకటేశ్వర్లు, యం మల్లేశం, యూనియన్ జిల్లా అద్యక్షులు బందెల భిక్షం, తదితరులు పాల్గొన్నారు.