Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు జిల్లాల పరిధిలో అమ్మకానికి 39 పార్సెల్స్
- రంగారెడ్డిజిల్లాలో 10, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 6,సంగారెడ్డి జిల్లాలో 23 విక్రయం
- కనీస ధరల్లో 121 గజాల నుంచి 10,164 గజాల స్థలాలు
- రేపటి నుంచి ప్రీబిడ్ సమావేశాలు
- మార్చి 1న ఈ-ఆక్షన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ల్యాండ్ పార్సిల్స్(ప్లాట్లు)ను మార్కెట్ రేటుపై ప్రజానీకానికి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ల్యాండ్ పార్సెల్స్(ప్లాట్లు)ను పారదర్శకంగా ఆన్లైన్ పద్ధతిలో వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఈ వేలం ప్రక్రియను నిర్వహించనున్నది. మధ్యతరగతి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, డెవలపర్లు ఈ ల్యాండ్ పార్సిల్స్ కొనుగోలుకు ఆసక్తి కనబస్తున్నారు.
39 ల్యాండ్ పార్సెల్స్
ప్రస్తుతం అందుబాటులో మూడు జిల్లాల పరిధిలో అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు దగ్గరలో అమ్మకానికి 39 ల్యాండ్ పార్సెల్స్ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో పది, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆరు, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సిల్స్ విక్రయానికి సిద్దంగా ఉన్నాయి. ఈ ప్రాంతాలను (ల్యాండ్ పార్సిల్స్) కేఎంఎల్ ఫైల్ ద్వారా చూసుకునే సదుపాయం ఉంది. అందుబాటు ధరల్లో 121 గజాల నుంచి 10,164 గజాల వరకు స్థలాలు ఉన్నాయి. రంగారెడ్ది జిల్లాలోని గండిపేట మండలంలో మూడు, శేరిలింగంల్లి మండలంలో ఐదు, ఇబ్రహీంపట్నం మండలంలో రెండు చోట్ల ల్యాండ్ పార్సెల్స్ ఉండగా, మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలంలో నాలుగు, ఘట్కేసర్ మండలంలో ఒకటి, బాచుపల్లి మండలంలో ఒకటి చొప్పున ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలం పరిధిలో 16, అరసీపురం మండలంలో ఆరు, జిన్నారం మండలంలో ఒకటి చొప్పున ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయి. మార్చి 1న 39 ల్యాండ్ పార్సిల్స్‌ను ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించడానికి హెచ్‌ఎండీిఏ సన్నాహాలు చేస్తున్నది. వంద శాతం ఎటువంటి చిక్కులు లేని, క్లియర్ టైటిల్ ఉన్న ఈ ల్యాండ్ పార్సెల్స్‌ను కొనుగోలు చేసిన వారు సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొందడానికి అవకాశం ఉంది. ఆన్లైన్ వేలంలో పాల్గొనడానికి వీలుగా ఈనెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీలో రిజిస్ట్రేషన్(నమోదు) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన వారందరూ మరుసటి రోజు ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల గడువు లోపు నిర్దేశించిన ఈఎండీ రుసుమును చెల్లించాల్సి ఉంటుందని హెచ్ఎండీఏ వెల్లడించింది.
రేపటి నుంచి ప్రీబీడ్ సమావేశాలు
హెచ్‌ఎండీిఏ వేలం వేస్తున్న ల్యాండ్ పార్సిల్స్‌పై కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నుంచి ప్రీ బిడ్ సమావేశాలు నిర్వహిస్తుంది. 21న రంగారెడ్డి జిల్లా ల్యాండ్ పార్సిల్స్‌పై శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసులో, 22న సంగారెడ్డి జిల్లా ల్యాండ్ పార్సిల్స్‌పై అర్సీపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో, 23న మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ల్యాండ్ పార్సిల్స్‌పై ఉప్పల్ స్టేడియం వద్ద గల సర్కిల్ ఆఫీస్‌లో ప్రీబిడ్ మీటింగ్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.