Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలోని ఏ గ్రామాన్ని తట్టిలేపినా ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షిభూతంగా నిలుస్తాయనీ, ఆ చరిత్రలను రికార్డు చేసి భావితరాలకు అందించాల్సిన అవసరముందని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ నొక్కిచెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ సాహిత్య అకాడమి కార్యాలయంలో సీనియర్ జర్నలిస్టు, రచయిత గుండెల రాజు రాసిన 'జంగిలిగొండ గ్రామ చరిత్ర' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ.. బైరాన్పల్లి నుంచి జనగాం వరకు, కడవెండి నుంచి జంగిలిగొండ వరకు మహోజ్జ్వలమైన చరిత్ర కలిగి ఉందన్నారు. రాజు శాస్త్రీయపద్ధతిలో గ్రామాన్ని బాగా అధ్యయనం చేసి పుస్తకం రాసిన తీరు బాగుందని ప్రశంసించారు. తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర మాట్లాడుతూ..తాను పుట్టి పెరిగిన గ్రామ చరిత్రను భావితరాలకు అందించాలనే సదుద్దేశ్యంతో రాజు చేసిన ప్రయత్నం బాగుందని అభినందించారు. సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ డైరెక్టర్, ఓయూ ప్రొఫెసర్ కొండ నాగేశ్వర్ రావు మాట్లాడుతూ జంగిలిగొండ వీరోచిత, సాంస్కృతి సాంప్రదాయ చరిత్రకు అనుగుణంగా 49 అంశాలపై లోతుగా అధ్యయనం చేసి గ్రామ చరిత్రను నిక్షిప్తం చేసిన తీరు అబ్బురపరిచిందన్నారు.